తిరకాసు త్రాసు | - | Sakshi
Sakshi News home page

తిరకాసు త్రాసు

Aug 23 2025 11:52 AM | Updated on Aug 23 2025 11:52 AM

తిరకా

తిరకాసు త్రాసు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో గల్లీ దుకాణం నుంచి సూపర్‌ మార్ట్‌ల వరకు సరుకుల తూకాల్లో మోసాలు పెరుగుతున్నా.. పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన తూనికలు కొలతల శాఖాధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూరగాయలు, పండ్లు, చికెన్‌, చేపలు, ప్రొవిజన్‌ స్టోర్స్‌, ఇతర సరుకులు, బంగారం.. ఇలా తూకాలతో వ్యాపారాలు చేసే దుకాణాలు సుమారుగా 3.70 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే తూనికల కొలతల శాఖ గడిచిన ఐదేళ్ల లెక్కలు చూస్తే.. ఏడాదికి 200 మించి తుకాల్లో మోసాలపై కేసులు నమోదు చేయలేదంటే వీరి తీరును అంచనా వేయొచ్చు. వీరు నమోదు చేసిన కేసుల లెక్కలు చూస్తే అంతా ధర్మబద్ధంగా తుకాలు తూసి వినియోగదారులకు ఇస్తున్నట్లే అనుకోవాలా?. నెల్లూరు నగరంలోని ప్రధాన ఏసీ కూరగాయల మార్కెట్లో ఠక్కరి తూకాలకు పాల్పడుతున్న విషయం జగద్వితమే. ఇక చికెన్‌, మటన్‌, చేపల దుకాణాల్లో అయితే అంతకు మించి తుకాల్లో కేటుతనం చూపిస్తున్నారు. ఈ కోవలోనే పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఈ స్థాయిలో తుకాల్లో మోసాలు జరుగుతుంటే.. ఈ శాఖాధికారులు ఠంఛన్‌గా రూ.వేల్లో జీతాలు, వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ శాఖాధికారులు ప్రతి దుకాణాన్ని తనిఖీ చేయడంతో పాటు వారి నుంచి స్టాంపింగ్‌, కాంపౌండ్‌ ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే వీరికి టార్గెట్లు లేకపోవడంతో కార్యాలయాల్లో కుర్చీలకే పరిమితమై అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు. ఐదేళ్ల క్రితం స్టాంపింగ్‌, కాంపౌండ్‌ ఫీజులు ఎంత వసూలు చేశారో.. ఐదేళ్ల తర్వాత కూడా అంతే మొత్తంలో వసూలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఐదేళ్లలో వ్యాపార దుకాణాలు విస్తరణ జరగలేదా? లేక.. విధులు వదిలేసి లంచాలతో విలాసాలు చేస్తున్నారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

‘ఆప్షన్స్‌’తో గోల్‌మాల్‌

ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ మెషిన్‌లో మొత్తం నాలుగు ఆప్షన్లు ఉంటాయి. కిలోకు 100–150 గ్రాముల తక్కువగా ఉండేలా సెట్‌ చేస్తున్నారు. ఎవరైనా కేజీ సరుకు అడిగితే.. తూకం మెషిన్‌లో కేజీకి మించి మొగ్గుగా చూపిస్తారు. ధర్మకాటాలో తూస్తే 850–900 గ్రాములే బరువు ఉంటుంది. అదే మెషిన్‌పై కిలో నికర బరువు ఉంచితే 1100–1150 గ్రాములు చూపుతోంది. అంటే ఏ రకంగా వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారో అర్థమవుతోంది.

ప్యాకింగ్‌లో సైతం

మార్కెట్‌లో లభించే వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లు కూడా నిర్దేశించిన బరువు కంటే తక్కువగా ఉంటున్నాయి. లీటర్‌ ప్యాకేజ్డ్‌ నిబంధన ప్రకారం 910 మి.లీ. ఉండాలి. కానీ 800–850 మి.లీ. మించడం లేదు. ఇక ఐదు లీటర్ల ప్యాకేజ్డ్‌ బాటిల్‌లో 200–280 గ్రా. 15 లీటర్ల ప్యాకేజ్డ్‌ డబ్బాలో 250–300 మి.లీ.తక్కువగా ఉంటుంది.

పసిడి తూకంలోనూ మోసం

నగరంలోని పెద్ద పెద్ద దుకాణాల్లో మినహా మిగతా సాధారణంగా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే విక్రయిస్తుంటారు. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్ల బంగారంతో మాత్రమే ఉంటుంది. వ్యాపారులు 18 క్యారెట్ల ఆభరణాన్ని వినియోగదారులకు 22 క్యారెట్లకు బిల్లు వసూలు చేస్తున్నారు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.700 వరకు తేడా ఉంటుంది. ఈ లెక్కన కనీసం 10 గ్రాములకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు మోసం చేస్తున్నారు. బంగారం తూచే ఎలక్ట్రానిక్‌ కాటాల వెను త్రాసును నియంత్రించే వీల్స్‌ బేరింగ్‌లను మార్పు చేసే అవకాశం ఉంటుంది. బంగారం నాణ్యతను తెలిపే మెషిన్‌ లేకపోవడంతో వినియోగదారులు మోసాలకు గురవుతున్నారు.

ఆర్టీసీ పార్శిల్‌ విభాగంలో..

ఆర్టీసీ ఆన్‌లైన్‌ పార్శిల్‌ విభాగంలో కూడా మోసాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా పార్శిల్‌ పంపుకొవాలంటే కేజీల వంతున వసూలు చేసే వారు. దీంతో అక్కడ వెయింగ్‌ మెషిన్‌లో భారీగా తేడాలు ఉంచి మోసం చేస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు చేస్తే విస్తుపోవాల్సి వచ్చింది. 50 కేజీల బరువు ఉన్న లగేజీ 60 కిలోలు చూపించింది. ఇలా తూకం ఎక్కువగా చూపించి మోసం చేయడం వెలుగులోకి వచ్చింది.

నగరంలో వస్తు విక్రయాల్లో

నిలువు దోపిడీ

నిండా మునుగుతున్న వినియోగదారులు

సాధారణ కాటా, ఎలక్ట్రానిక్‌

మెషీన్లలోనూ చేతివాటం

తూచేది కేజీ.. ఉండేది 850 గ్రాములే

ప్యాకింగ్‌ సరుకుల్లోనూ అంతే..

గల్లీ దుకాణం నుంచి సూపర్‌ మార్ట్‌ల వరకు మోసాలు

ఫిర్యాదులు వస్తేనే తనిఖీలు

తూకాల్లో మోసానికి కాదేది అనర్హం అన్నట్లుగా నిత్యావసర సరుకుల నుంచి నిత్యం వినియోగించే ఆహార పదార్థాల వరకు, ఆఖరికి బంగారం తూకంలోనూ వ్యాపారులు మోసాలకు తెగబడుతున్నారు. నెల్లూరు నగరంలో కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసినా, మాంసం, చేపలు తీసుకున్నా కాటాల్లో కేటుతనం చూపిస్తున్నారు. ప్యాక్డ్‌ నూనె, పప్పులు, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకుల్లోనూ అదే గోల్‌మాల్‌. సాధారణ త్రాసుల్లోనూ, ఎలక్ట్రానిక్‌ మెషీన్లలోనూ సెట్టింగ్‌లు చేసి వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తేనే అధికారులు తనిఖీలకు వెళ్తున్నారు. మొదటిసారి పట్టుబడితే జరిమానా, మళ్లీ పట్టుబడితే కేసులంటూ హెచ్చరిస్తున్నా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు.

కేసులే కానీ.. శిక్షల్లేవ్‌..

తూకాల్లో మోసం, నిబంధనల ఉల్లంఘనలపై మొదటి సారి జరిమానా విధిస్తారు. అదే తప్పు తిరిగి చేస్తే కేసు నమోదు చేసి కోర్టుకు సిఫార్సు చేస్తారు. కోర్టు జరిమానాతోపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే కొన్నేళ్లలో తూనికలు కొలతల శాఖ అధికారులు నమోదు చేసిన కేసుల్లో ఒక్కరికి కూడా శిక్ష పడిన దాఖలాలు లేవంటే వీరు నమోదు చేసే కేసులు కోర్టు వరకు వెళ్లకుండానే అమ్యామ్యాలతో మాఫీ చేస్తున్నారని అర్థమవుతోంది. ఒక వేళ ఒకటీ.. అరా కోర్టు వరకు వెళ్లి కేసుల్లోనూ మోసగాళ్లకు శిక్ష పడకుండా కేసును నీరుగార్చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తక్కువ తూకం వేస్తే తూనికలు, కొలతల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 2009 యాక్ట్‌ సెక్షన్‌ 30 ప్రకారం కనీసం రూ.1000 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. ప్యాకేజీ కమోడిటి యాక్ట్‌ 30 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా వేస్తారు.

లక్షల్లో దుకాణాలు.. రెండొందలు దాటని కేసులు

జిల్లాలోపెద్ద, చిన్న చితకా వ్యాపార సంస్థలన్ని కలిపి దాదాపు 3.70 లక్షల దుకాణాలు ఉంటే.. ఒక్క నెల్లూరు నగరంలోనే సుమారు 1.50 లక్షలకు పైగా ఉంటాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి మోసాలను అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతల శాఖ అధికారులపై ఉంది. అయితే వీరు సుమోటోగా తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాల్సి ఉండగా, తమ విధులకు స్వస్తి చెప్పి.. కార్యాలయాల్లో కూర్చొని అవినీతి మత్తులో తూగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలుదారులు ఫిర్యాదులు చేస్తే తనిఖీలు చేస్తున్నారనేదానికి గడిచిన ఐదేళ్లలో వీరు నమోదు చేసిన కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

సం శ్రీశ్రీ స్టాంపింగ్‌ ఫీజు కాంపౌండ్‌ ఫీజు డబ్ల్యూఅండ్‌ఎం ప్యాకింగ్‌ మొత్తం

(రూ.ల్లో) (రూ.ల్లో) కమోడిటి

2019–20 75,73,840 26,01,100 114 75 189

2020–21 83,63,610 26,78,500 108 46 154

2021–22 92,90,566 24,25,000 195 56 251

2022–23 80,39,852 21,72,000 201 48 249

2023–24 95,85,701 26,92,500 123 84 207

తిరకాసు త్రాసు1
1/2

తిరకాసు త్రాసు

తిరకాసు త్రాసు2
2/2

తిరకాసు త్రాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement