
ఎన్‌ఐఓటీతో ఒప్పందం విద్యార్థులకు వరం
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ (ఎన్‌ఐఓటీ) మధ్య కుదిరిన ఒప్పందం విద్యార్థులకు వరమని వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని వీఎస్‌యూలో వీసీ ఇతర అధికారులతో కలిసి ఒప్పందానికి సంబంధించిన పత్రాలను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఎస్‌యూ, ఎన్‌ఐఓటీ మధ్య ఈనెల 20వ తేదీన ఒప్పందం కుదిరిందని చెప్పారు. మనిషి సముద్రంపై అవగాహన పెంచుకోవడంలో విఫలం చెందాడన్నారు. ఎన్నో ఖనిజాలకు నెలవైన సముద్రాన్ని అన్వేషించడం దేశ ఆర్థిక ప్రగతి మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలియజేశారు. గుజరాత్ రాష్ట్రం అత్యధిక తీర ప్రాంతంతో మొదటి స్థానంలో ఉంటే, మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. పరిశోధనలు ముమ్మరం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ రూ.4,500 కోట్లతో సముద్రయాన్ పథకాన్ని రూపొందించారని, ఇది మైరెన్ బయాలజీ విభాగం విద్యార్థులకు ఎంతో ప్రయోజనంగా మారుతుందన్నారు. ఒప్పందం కింద మైరెన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. సమావేశంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, మైరెన్ బయాలజీ విభాగం హెడ్ డాక్టర్ హనుమారెడ్డి, సీహెచ్ వెంకట్రాయులు తదితరులు పాల్గొన్నారు.