
హామీలెప్పుడు నెరవేరుస్తారు?
● కలెక్టరేట్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నిరసన
నెల్లూరు రూరల్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు’ అని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ప్రశ్నించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.6,400 కోట్లను విడుదల చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లును పెంచాలన్నారు. అర్హులైన వారికి తల్లికి వందనం రూ.15 వేలు ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ డిగ్రీ కళాశాలను పునఃప్రారంభించాలని, ఎయిడెడ్ కొనసాగించాలన్నారు. యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే జీఓలను రద్దు చేయాలన్నారు.