
‘కూటమి’ నిర్లక్ష్యం
● నిలిచిన రిటైనింగ్ వాల్ పనులు
● పైసా ఇవ్వని ప్రభుత్వం
● పేరుకుపోతున్న చెత్తాచెదారం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులకు నిధులు ఇవ్వడం లేదు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ప్రజాప్రతినిధులు మైకు ముందు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
నాడు ఇలా..
పెన్నానది నుంచి నెల్లూరు సిటీ గుండా 20 కిలోమీటర్ల మేర సర్వేపల్లి కాలువ ఉంది. దీని ద్వారా 47 వేల ఎకరాల్లో పంటలకు సాగునీరు అందుతుంది. ఎక్కువగా నీరు, వరదలు వచ్చినప్పుడు కాలువ పొంగడం, గట్టుపై ఉన్న ఇళ్లకు ప్రమాదాలను నివారించేందుకు 2021 సంవత్సరంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.99 కోట్ల అంచనాలతో రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది. 0.6 కిలోమీటర్ శెట్టిగుంటరోడ్డు నుంచి 0.30 కి.మీ ముత్తుకూరు రోడ్డు బ్రిడ్జి వరకు కాలువకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇంత వరకు రూ.54.19 కోట్లు బిల్లులు చెల్లించగా 56 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇంకా 1.5 కి.మీ పని మిగిలి ఉంది.
నిధులివ్వకుండా..
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ కాలువ నిర్మాణానికి నయాపైసా విదల్చలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. పనులు పూర్తి కాకుండానే పంట కాలువకు నీరు వదలడంతో సిటీ పరిధిలో కాలువలో కొన్నిచోట్ల గండ్లు పడి ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పంటలకు నీరు వదిలినా మధ్యలో ఉన్న ఖాళీల్లో చెత్తాచెదారం విపరీతంగా చేరిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కాలువపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పనులు, ఆక్రమణలపై ఏఈ డి.మహేశ్వర్ స్పందిస్తూ కొత్తగా బాధ్యతలు చేపట్టాననని, ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

‘కూటమి’ నిర్లక్ష్యం