
అశ్వవాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి
వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో కొలువైన భగవాన్ వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం వెంకయ్యస్వామి ఆలయంలో నిత్య పూజలనంతరం స్వామి వారిని అశ్వవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూలాలంకరణ చేశారు. భక్తులు భుజాలపై స్వామి వారిని ఆలయం చుట్టూ తిప్పారు. ఆ తర్వాత ట్రాక్టర్‌పై స్వామి వారిని ఆశీనులను చేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతినిచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ గ్రామోత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది. ఉత్సవం ముందు మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తులు భారీగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అశ్వవాహనసేవకు నెల్లూరుకు చెందిన గుదె శ్రీధర్, అరుణమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
కనుల పండవగా పెదశేష వాహన సేవ
వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పెద శేష వాహనసేవ నిర్వహించారు. స్వామివారిని పెద శేషవాహనంపై ఆశీనులను చేసి విద్యుద్దీపాలంకరణ చేశారు. పెదశేష వాహనసేవ గొలగమూడి వీధుల్లో వేడుకగా సాగింది. ఉత్సవం వెంట భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉత్సవాల్లో నేడు
వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.