
మీటర్ పెట్టినా షాకే
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తాము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే చార్జీలు తగ్గిస్తామని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకరిస్తున్నామని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగుల కొట్టండని గతంలో చంద్రబాబు, లోకేశ్‌లు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక సర్ చార్జీలు, టూఅప్ చార్జీలు (ఇంధన సర్దుబాటు చార్జీలు) పేరుతో మూడేళ్ల క్రితం వాడుకుని చెల్లించిన విద్యుత్ ల్లులకు తాజాగా విద్యుత్ చార్జీలు అమాంతం పెంచి రూ. వేల కోట్లు భారం వేసి ప్రజల నడ్డి విరుస్తోంది. వాడుకున్న విద్యుత్ కంటే ట్రూ అప్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో వచ్చే బిల్లులే ఎక్కువ కావడంతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. గతంలో చెప్పిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వేగవంతం చేస్తోంది. ఈ మీటర్లు పెట్టుకుంటే రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక టారిఫ్, మధ్యాహ్నం నుంచి ఒక టారిఫ్, సాయంత్రం నుంచి మరో టారిఫ్‌లతో బిల్లుల మోత మోగుతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న వారు కరెంట్ కావాలంటే ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త మీటర్లకు చార్జీలు భారీగా పెంపు
ఈ షాక్‌లు ప్రజలకు సరిపోవన్నట్లుగా ప్రభుత్వం ప్రజలపై మరో పెద్ద షాక్ వేసింది. కొత్తగా విద్యుత్ సర్వీసు కనెక్షన్ కావాలనుకునే ప్రజలకు ఇది నిజంగా పెద్ద షాకే అని చెప్పాలి. నూతనంగా విద్యుత్ సర్వీసు కావాలనుకుంటే గృహ వినియోగదారులు కేటగిరీ–1లో ఒక కిలో వాట్ విద్యుత్ కనెక్షన్‌కు గతంలో రూ.1,850 ఉంటే ఇప్పుడు రూ.4150లకు పెంచారు. రెండు కిలో వాట్‌కు అయితే రూ.3,750 నుంచి రూ.7,800 వరకు పెంచేసింది. వ్యాపార, వాణిజ్య వినియోగదారులు కేటగిరీ–2లో ఒక కిలో వాట్‌కు రూ.2,250 ఉంటే.. ఇప్పుడు రూ.5,300 వరకు పెంచటం జరిగింది. అదే రెండు కిలో వాట్‌కు రూ.4,500 నుంచి రూ.9,800 వరకు పెంచారు. గతంలో నూతన విద్యుత్ సర్వీసు కనెక్షన్ కోసం ప్రజలు విద్యుత్ సంస్థకు చెల్లించే రుసుం కంటే ప్రస్తుతం వంద రెట్లకు పైగా వసూలు చేస్తుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ పరిణామాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది.
సామాన్యులపై కూటమి ప్రభుత్వం మరో భారం
ట్రూఅప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లతో
ఇప్పటికే దోపిడీ
తాజాగా కొత్త మీటర్లకు
వంద శాతం పైగా పెంపు