
‘మా పొట్ట కొట్టొద్దు’
సోమశిల: కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని నేతలు అన్నారు. అనంతసాగరం మండల కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఆటో కార్మికుల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి రాజా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోల్లో ప్రయాణించే వారు తగ్గిపోయారన్నారు. కార్మికులు కుటుంబాలను ఏ విధంగా పోషించాలని ప్రశ్నించారు. వాహనమిత్ర ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేశ్ పాదయాత్ర సమయంలో ఆటో కార్మికులతో నడిచి కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వాలన్నారు. ఆ సంఘం గౌరవాధ్యక్షుడిగా అన్వర్‌బాషా, అధ్యక్షుడిగా నాయబ్ జానీ, కార్యదర్శిగా మస్తాన్ నియమితులయ్యారు.