
అంగన్‌వాడీ సరుకులు తరలిస్తుండగా..
● పట్టుకున్న గ్రామస్తులు
● వేరేచోట భద్రపరిచేందుకన్న కార్యకర్త
పొదలకూరు: పట్టణానికి సమీపంలోని తెలుగుగంగ పునరావాస కేంద్రం(వెంకటేశ్వరనగర్) అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలకు చెందిన సరుకులను మంగళవారం కార్యకర్త తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని సీడీపీఓ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల కథనం మేరకు.. కార్యకర్తగా పనిచేస్తున్న సునీత పిల్లలకు అందజేయాల్సిన కోడిగుడ్లు, బాలామృతం తదితర సుమారు రూ.15 వేలు విలువైన సరుకులను తరలిస్తుండగా అటకాయించారు. ఆటోతో సహా నిలిపివేసి పోలీసులకు అప్పగించాలని ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే సరుకులను అక్కడే ఉంచి వెంకటాచలం సీడీపీఓకు సమాచారం అందించారు. అంగన్‌వాడీ టీచర్ మాత్రం సరుకులను వేరే ఇంట్లో భద్రపరిచేందుకు తరలిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పుకొస్తున్నారు. సీడీపీఓ విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.