
స్టాఫ్ నర్సుల విధుల బహిష్కరణ
నెల్లూరు(అర్బన్): మేల్ నర్సు వెంకటప్పయ్యపై దాడి చేసిన జూనియర్ డాక్టర్ శ్రీతేజ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విధులను బహిష్కరించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ అసోసియేషన్ సమన్వయకర్త మాధురి మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం క్యాజువాలిటీలో రద్దీగా ఉండటంతో రోగికి వైద్యం త్వరగా చేయాలని శ్రీతేజను వెంకటప్పయ్య కోరాడన్నారు. ఈ క్రమంలో వచ్చిన స్పల్ప విభేదాలను దృష్టిలో ఉంచుకుని వెంకటప్పయ్య డాక్టర్‌కు క్షమాపణ చెప్పాడన్నారు. అయినా శిక్షణలో ఉన్న 15 మంది జూనియర్ డాక్టర్లను వెంట బెట్టుకుని మద్యం మత్తులో శ్రీతేజ సోమవారం రాత్రి విధుల్లో ఉన్న వెంకటప్పయ్యను తిడుతూ దాడి చేశాడన్నారు. అడ్డుపడిన కల్యాణ్ అనే మరో నర్సుపై దాడి చేశారన్నారు. సీనియర్ స్టాఫ్ నర్సు శాంతిని తోసేసి బెదిరించారన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ మాధవికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఎమర్జెన్సీ మినహా మిగిలిన చోట్ల విధులు బహిష్కరించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు.
కేసు నమోదు
స్టాఫ్ నర్సులు నాలుగో నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీతేజ, సందీప్, దినేష్, గగన్, భార్గవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు శాంతి, శ్రీలత, లావణ్య, వసుంధర తదితరులు పాల్గొన్నారు.