
సకాలంలో వ్యవసాయ సర్వీసుల మంజూరు
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
● ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వెంటనే మంజూరు చేయాలి. రైతులు, వినియోగదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకునే పద్ధతికి స్వస్తి పలకాలి’ అని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు అన్నారు. జిల్లాలోని కావలి పట్టణంలో స్పందన ఫంక్షన్ హాల్లో మంగళవారం కావలి డివిజన్ విద్యుత్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్ ద్వారా విద్యుత్ శాఖ వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంలో కావలి డివిజన్‌లోని బోగోలు, కావలి రూరల్ సెక్షన్ల పనితీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందా?, లోఓల్టేజీ సమస్యలు ఉన్నాయా?, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? అనే మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వం వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుందన్నారు. అయితే బోగోలు, కావలి రూరల్ సెక్షన్ల నుంచి వినియోగదారులకు సంతృప్తికర సేవలు అందడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పీఎం సూర్యఘర్‌కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు యుద్ధప్రాతిపదికన అంగీకారపత్రాలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆర్టీఎస్‌ఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామికీకరణ కోసం రూ.400 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయన్నారు. నూతనంగా 336 వ్యవసాయ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లోనే నివాసం ఉండాలని, లేకపోతే హెచ్‌ఆర్‌ఏ కట్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్, జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్, కావలి ఈఈ బెనర్జీ, డీఈఈ, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.