
సాక్షి, నెల్లూరు: జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ వ్యవహారంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్టు అరుణ ఆరోపించారు. తన అరెస్ట్‌కు ముందు.. ఆమె కారు డిక్కీలో దాక్కుని సెల్ఫీ వీడియో తీసి అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. తనను మీడియానే కాపాడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వీడియోలో మాట్లాడుతూ..‘నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదు. నా ప్రాణాలు ఉంచుతారో, తీస్తారో కూడా తెలియదు. నేను కారు డిక్కీలో దాక్కుని మాట్లాడుతున్నాను. నా కారులో గంజాయి పెట్టి అక్రమ కేసు పెట్టాలని చూస్తున్నారు. నన్ను ఏ అక్రమ కేసులో ఇరికిస్తున్నారో తెలియడం లేదు. నన్ను మీడియానే కాపాడాలి’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. కరుడుగట్టిన నేరస్థుడు శ్రీకాంత్‌కు కూటమి ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకి పొక్కడంతో పెరోల్ రద్దు చేశారు. అయితే, శ్రీకాంత్ పెరోల్ మంజూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్, హోం శాఖ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పేర్లు బయట పెడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్టు అరుణ ఆరోపించారు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు.
అరుణ సంచలన వ్యాఖ్యలు..
అంతకుముందు నిడిగుంట అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ‘మమ్మల్ని వాడుకుని వదిలేశారు. ఇప్పుడు మాపైనే విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల బండారం బయట పెడతా. మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతోంది. ఇన్ని నిందలు మోపుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా.. ఇంకా బాధపడాలా?. ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికేకన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అని తెలిపారు.
జీవిత ఖైదీ శ్రీకాంత్‌తో ఆస్పత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వెనుక టీడీపీ నేతల కుట్ర దాగి ఉందని అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో అరుణ..‘మాపై ఇంత కుట్ర జరుగుతుంటే.. శ్రీకాంత్ బాధపడుతుంటే శ్రీకాంత్‌ను ఇన్నాళ్లు వాడుకున్న వాళ్లంతా నోరు మెదపకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీ మౌనాన్ని మేం ఎలా అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్కచేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు! అంతే కదా! ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు’ అంటూ ఆ పోస్టులో అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుదిపేస్తున్న శ్రీకాంత్ వ్యవహారం
హత్య కేసులో నెల్లూరు జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉంటూనే శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, టీడీపీ క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న అతను ఆ పార్టీ కీలక నేతల సహకారంతో తరచూ పెరోల్‌పై బయటకు వస్తున్న వైనం ఇప్పుడు అధికార పార్టీని, ప్రభుత్వ పెద్దల నుంచి హోంశాఖను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు హోంశాఖ స్థాయిలో కథ నడిపించారనేది స్పష్టం కావడంతో ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసిన ఐదు రోజుల్లోనే దానిని రద్దు చేసి, ఖైదీని జైలుకు తరలించారు.

అండగా ఓ మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు
అరుణ పోస్టు ప్రకారం ఒక మంత్రి, ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆమెకు అండగా ఉన్నారనే కొత్త కోణం వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలకు, క్రిమినల్స్‌కు మధ్య సంబంధాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.