
కాకాణి విడుదల్లో జాప్యం
వెంకటాచలం: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు బెయిలిచ్చినా, మంజూరు పత్రాలను ఇవ్వడంలో ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో జైలు నుంచి మంగళవారం ఆయన విడుదల కాలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకాణిపై ఎనిమిది అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపారు. ఏడు కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించగా, తాజాగా మిగిలిన దాంట్లో సోమవారం మంజూరైంది. దీంతో నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి మంగళవారం విడుదలవుతారని భావించారు. అయితే బెయిల్ మంజూరు పత్రాలను ఆలస్యంగా ఇవ్వడంతో అవి అధికారులకు సకాలంలో అందలేదు. దీంతో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది.
అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
తమ అభిమాన నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి విడుదలవుతారని తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు జిల్లా కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్నారు. కొందరు తమ అభిమానాన్ని చాటుతూ జైలుకెళ్లే మార్గంలో కాకాణికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని తొలగించడమే కాకుండా జైలు వద్ద ఉన్న శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. కొందరు ఏదో మార్గంలో వెళ్తుంటే, ఖాకీలు అత్యుత్సాహంతో బైక్‌లను ఆపి తాళాలను లాక్కొన్నారు.
నిరాశగా వెనుదిరిగి..
చెముడుగుంట పంచాయతీ పవన్‌కాలనీ నుంచి బుజబుజనెల్లూరు వరకు నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో వేలాది మంది పార్టీ శ్రేణులు కాకాణి రాక కోసం గంటల తరబడి వేచి చూశారు. చివరికి ఆయన విడుదల కావడంలేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు.
జాప్యం బాధాకరం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం విడుదల కాకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో సంతోషంగా జైలు వద్దకొచ్చామని, అయితే గూడూరు కోర్టు నుంచి 5.30 తర్వాత బెయిల్ మంజూరు పత్రాలివ్వడంతో విడుదల ఆలస్యమైందని చెప్పా రు. అనంతరం కాకాణి కుమార్తె, పార్టీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత మాట్లాడారు. తన తండ్రి జైలుకెళ్లాక, ఏనాడూ ఇక్కడికి రాలేదని, ఈ రోజు విడుదలవుతున్నారనే సంతోషంతో రాగా, జాప్యం కావడం బాధగా ఉందని తెలిపారు. బెయిల్ మంజూరు పత్రాలను సకాలంలో కోర్టు వద్దకు చేర్చడంలో మా తప్పు లేకపోయినా, ఎప్పుడు విడుదలవుతారనే విషయమై స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. బుధవారం ఏ సమయంలో విడుదల చేస్తారనే విషయమై సమాధానం చెప్పేవారే లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బెయిల్ మంజూరు
పత్రాలివ్వడంలో ఆలస్యం
కలిసేందుకు వేలాదిగా
తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు
జైలు వద్దకు వెళ్లనీయకుండా
పోలీసుల ఆంక్షలు
నేడు బయటకు..
నెల్లూరు (లీగల్): జిల్లా కేంద్ర కారాగారం నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం ఉదయం విడుదల కానున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన విడుదల కోసం రూ.రెండు లక్షల ఆస్తి కలిగిన ఇద్దరు జామీన్‌దార్లతో పత్రాలను గూడూరు ఇన్‌చార్జి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కోర్టులో రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమయ్యాయి. జిల్లా కేంద్ర కారాగార నిబంధనల మేరకు రిలీజింగ్ ఆర్డర్స్‌కు సమయం మించిపోవడంతో మంగళవారం విడుదల కాలేకపోయారు.

కాకాణి విడుదల్లో జాప్యం