
సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి విహారం
వెంకటాచలం: ఆరాధనోత్సవాల్లో భాగంగా గొలగమూడిలోని భగవాన్ వెంకయ్యస్వామి సూర్యప్రభ వాహనంపై మంగళవారం దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, అభిషేకాలను జరిపారు. చంద్రప్రభ వాహనసేవను రాత్రి నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవాన్ని జరిపారు.
ఉత్సవాల్లో నేడు
ఉత్సవాల్లో భాగంగా హనుమంత, హంసవాహన సేవను బుధవారం నిర్వహించనున్నారు.
పొగాకు సగటు ధర
రూ.196.62
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 184 బేళ్లను మంగళవారం విక్రయించామని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. సగటున రూ.196.62 ధర లభించింది. వేలానికి 336 బేళ్లు రాగా 184ను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని తెలిపారు. వేలంలో 21,528.3 కిలోల పొగాకును విక్రయించారు. గరిష్టంగా రూ.280, కనిష్టంగా రూ.140 ధర లభించింది.
ఉన్నత విద్యకు
ఉపకార వేతనాలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఉన్నత విద్యనభ్యసించాలనే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలను నేషనల్ ఫెలోషిప్, నేషనల్ స్కాలప్‌షి ప్ పథకాల ద్వారా అందజేస్తున్నారని ఐటీడీఏ పీఓ మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు చేసేందుకు ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు నేషనల్ ఫెలోషిప్ స్కాలర్‌షిప్‌కు అర్హులని చెప్పారు.
● డిగ్రీ, పీజీ కోర్సులు చేసేందుకు ఎంపిక చేసిన కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు నేషనల్ స్కాలర్‌షిప్ పథకానికి అర్హులని వివరించారు. వీరి వార్షికాదాయం రూ.ఆరు లక్షలకు మించరాదన్నారు. ఆన్‌లైన్లో వచ్చే నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఓపెన్ స్కూల్ ఫీజు
గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశానికి రూ.200 అపరాధ రుసుముతో ఫీజు గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించారని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఫీజును ఆన్‌లైన్లో చెల్లించాలని, వివరాలకు 89194 28319 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
యథేచ్ఛగా
గ్రావెల్ దందా
కావలి (జలదంకి): కావలి మండలంలోని చలంచర్లలో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. చెరువులో రెండు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాలకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలించారు. ఎలాంటి అనుమతుల్లేకుండా తెలుగు తమ్ముళ్లు ఇలా వ్యవహరిస్తున్నా.. ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి విహారం

సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి విహారం