
అక్టోబర్ నాటికి ప్లాంటేషన్లు పూర్తి
ఉదయగిరి: జిల్లాలో ప్లాంటేషన్ ప్రక్రియను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్‌బాషా పేర్కొన్నారు. పట్టణంలోని చెక్క నగిషీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన అనంతరం అక్కడి మహిళలు, నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఐదు అటవీ రేంజ్‌ల పరిధిలో 960.48 హెక్టార్లలో మొక్కల పెంపకం లక్ష్యమన్నారు. నర్సరీల్లో 20.65 లక్షల మొక్కలను పెంచుతున్నామని వివరించారు. వర్షాల నేపథ్యంలో ఐదు అటవీ రేంజ్‌ల పరిధిలో మొక్కలు నాటేందుకు ప్లాంటేషన్లను సిద్ధం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే 60 హెక్టార్లలో మొక్కలు నాటడాన్ని పూర్తి చేశామన్నారు. చెక్క నగిషీ కేంద్రంలో వస్తువుల తయారీకి ఉపయోగించే వివిధ రకాల దేవదారు, కలివి, నెర్ది, బల్లనెర్ది కలప అందుబాటులో లేవని, వీటిని అటవీ శాఖ ప్లాంటేషన్లలో పెంచి తయారీదారులకు సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందులో భాగంగా జిల్లాలోని నగరవనంలో స్టాళ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం దుర్గంపల్లె నర్సరీ, సర్వరాబాద్ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. రేంజ్ అధికారి కుమార్‌రాజా, ఎఫ్‌ఎస్‌ఓ చిన్న వెంకటయ్య, ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు, కేంద్ర నిర్వాహకుడు జాకీర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.