
యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
దుత్తలూరు: జిల్లాకు ఈ సీజన్లో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి పేర్కొన్నారు. దుత్తలూరు బిట్ – 1 సచివాలయంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జామాయిల్ తోటలు సాగుచేసే వారికి యూరియాను ఇవ్వడంలేదని, వీరు కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు. పంటలను పరిశీలించి అవసరమైన వారికి యూరియాను అందిచాలని కోరారు. ఈ – పంట నమోదు చేయించుకోవాలని, అన్నదాత సుఖీభవ పథకం అందని వారికి ఏమైనా సమస్యలుంటే రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. ఉదయగిరి నియోజకవర్గానికి కందులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రైతులు తమ సమీప కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు. మున్ముందు మినుములూ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లా వ్యవసాయ కార్యాలయ ఏడీఏ నర్సోజీరావు, వ్యవసాయ శాస్త్రవేత్త కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరి ఏడీఏ లక్ష్మీమాధవి, వ్యవసాయాధికారులు వెంకటసుబ్బారెడ్డి, మదన్‌మోహన్, చెన్నారెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.