
‘బార్ టెండర్లలో పాల్గొనబోం’
● నెలకు రూ.పది లక్షల నష్టం తప్పదు
● బార్ యజమానుల అసహనం
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీపై బార్ల యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో నెలకు రూ.పది లక్షల నష్టం వస్తుందని, ఈ తరుణంలో టెండర్లలో తాము పాల్గొనబోమంటూ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా మంగళవారం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో ఉంటున్న తమకు నూతన లాటరీ విధానంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రస్తుతం యజమానులుగా ఉన్న తాము లైసెన్స్‌లను పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నారు.
ఎంత తేడా..
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏడాదికి రూ.40 లక్షల బార్ లైసెన్స్ ఫీజు, 22 శాతం మార్జిన్ ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో ఏడాదికి రూ.75 లక్షల ఫీజుతో పాటు మూడేళ్ల కాలపరిమితి ఇవ్వడంతో తమకు వ్యాపార భద్రత కరువవుతుందని తెలిపారు. రూ.99 బ్రాండ్ ఇవ్వకపోతే తాము నష్టపోతామని, మద్యం దుకాణాలకు పర్మిట్ రూములను ఇవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెప్పారు. గడిచిన ఏడాదే నగరంలో ఒక్కో బార్ యజమాని దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నష్టపోయిన అంశాన్ని ప్రస్తావించారు.