
భూముల ఆక్రమణపై విజిలెన్స్
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని వవ్వేరులో గల కనిగిరి చెరువు వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలు, భూముల ఆక్రమణపై విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. కనిగిరి రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న భూముల్లో గ్రావెల్ మాఫియా కొన్ని రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వేసింది. వీటిని విక్రయించి రూ.కోట్లు గడించడమే కాకుండా ఆయా భూములను చదును చేసి ఆక్రమించారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. వ్యవహారం జిల్లా విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. కనిగిరి రిజర్వాయర్ వద్ద గ్రావెల్ తవ్విన ప్రదేశాలు, ఆక్రమణకు గురైన స్థలాలను పరిశీలించారు. 920 సర్వే నంబర్‌లో వందలాది ఎకరాలు అక్రమార్కుల చెరలో ఉన్నాయనే అంశాన్ని గుర్తించారు. గ్రామస్తులను అడిగి పలు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడారు. భూముల ఆక్రమణ, గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నామని చెప్పారు. సంబంధమున్న వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.