పోటెత్తి.. వినతులందించి.. | - | Sakshi
Sakshi News home page

పోటెత్తి.. వినతులందించి..

Aug 19 2025 5:04 AM | Updated on Aug 19 2025 5:04 AM

పోటెత

పోటెత్తి.. వినతులందించి..

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

426 అర్జీల అందజేత

నెల్లూరు రూరల్‌: నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్‌ ఆనంద్‌, డీఆర్వో హుస్సేన్‌ సాహెబ్‌, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డ్వామా పీడీ గంగా భవాని, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. అధికంగా రెవెన్యూ శాఖవి 129, మున్సిపల్‌ శాఖవి 31, సర్వేవి 34, పంచాయతీరాజ్‌ శాఖవి 57, పోలీసు శాఖవి 79, సివిల్‌ సప్లయ్స్‌వి 7, ఇతర శాఖలకు సంబంధించి 426 అర్జీలను ప్రజలు అందజేశారు.

రిజర్వేషన్ల అమలు కోసం..

చంద్రబాబు గతంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌ హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలటూ బీఎస్పీ నాయకులు కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకి ప్రసాద్‌, నాయకులు పాల్గొన్నారు.

పింఛన్ల తొలగింపు దారుణం

రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగా దివ్యాంగుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం తొలగించిందని, ఇది దారుణమని ఆ సంఘం జిల్లా నాయకుడు ఆవుల నాగేంద్ర అన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ధైర్యముంటే ఫేక్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన డాక్టర్లను అరెస్ట్‌ చేయాలన్నారు. అన్ని అర్హతలున్న వారిని కూడా పెన్షన్‌ రాకుండా చేయడం దారుణమన్నారు.

ఈ–క్రాప్‌పై చర్యలకు..

మరో వారం, పదిరోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయని, ఇంత వరకు ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారుతుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినయ్‌ నారాయణ కోరారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

కక్షతో జీతం ఆపేసిన వైద్యాధికారి

కక్ష కట్టి జలదంకి వైద్యాధికారి శ్రీనివాసులు రెండు సంవత్సరాల నుంచి జీతం ఆపేశారని కావలికి చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ రసూల్‌ కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాసులు, ఆయన భార్య డాక్టర్‌ లక్ష్మి వేధిస్తున్నట్లు ఆరోపించారు. జీతాలు చెల్లించాలని డీఎంహెచ్‌ఓ ఆర్డర్‌ ఇస్తే పెడచెవిన పెట్టి నువ్వు ఎలా తెచ్చుకుంటావో చూస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. లేబర్‌ కమిషన్‌ ఆర్డర్‌ను కూడా పట్టించుకోలేదన్నారు. హెల్త్‌ డైరెక్టర్‌ విచారణ రిపోర్ట్‌లో జీతం జలదంకిలోనే చెల్లించాలని చెప్పిందన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగి అయిన తనకు రెండేళ్లుగా జీతం లేదని, ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.

పోస్టులు భర్తీ చేయాలంటూ..

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 203 పోస్టులను 2025 డీఎస్సీలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ నోటిఫికేషన్‌లో నెల్లూరు కార్పొరేషన్‌లో 16 ఖాళీలను మాత్రమే చూపించారన్నారు. అయితే 203 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జి.కృష్ణప్రసాద్‌, పి.నాగరాజు, కిశోర్‌, మస్తాన్‌, కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తి.. వినతులందించి..1
1/1

పోటెత్తి.. వినతులందించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement