
ఆస్తి రాయించుకుని గెంటేశాడు
● కుమారుడిపై తండ్రి ఫిర్యాదు
● సమస్యలు తెలుసుకున్న ఎస్పీ కృష్ణకాంత్
● న్యాయం చేస్తామని భరోసా
నెల్లూరు(క్రైమ్): ‘నా చిన్న కుమారుడు ఆస్తి రాయించుకుని నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. విచారించి న్యాయం చేయాలి’ అని నెల్లూరు సంతపేటకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు. ఉద్యోగం పేరిట నగదు తీసుకుని మోసగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిరాకరించాడు.. కుమారుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 78 మంది విచ్చేసి తమ సమస్యలపై ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారు. రాత్రిపూట బస్టాండ్‌లో ఉంటున్నాను. విచారించి న్యాయం చేయాలని కావలికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు.
● లింక్డిన్ ద్వారా మాధురి, వెంకటరమణ, చేతన్‌లు పరిచయమయ్యారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.34 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకుడా, నగదు తిరిగివ్వకుండా మోసగించారని పొదలకూరుకు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు.
● హైదరాబాద్‌కు చెందిన సుదర్శన్ క్రిప్టో ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ఆరునెలల నుంచి ప్రాఫిట్ ఇవ్వకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్‌కు చెందిన ఓ వ్యక్తి వినతిపత్రమిచ్చాడు.
● నా కుమారుడికి 15 సంవత్సరాలు. అతడితో ఆత్మకూరుకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుంది. పదిరోజుల క్రితం కుమారుడిని తీసుకెళ్లి బలవంతంగా పెళ్లిచేసుకుని దాచిపెట్టింది. ఆచూకీ కనుక్కోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు.
● ఉదయగిరికి చెందిన వెంకటకుమార్ ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడు. ఇదేమని అడిగితే సోషల్ మీడియాలో ఫొటోలు ఆప్‌లోడ్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి విజ్ఞప్తి చేశారు.
● నా కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకోవాలని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.