
పెళ్లికెళ్లొస్తూ కానరాని లోకాలకు..
● ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న టాటా ఏస్
● ఇద్దరి మృతి, ఒకరికి తీవ్రగాయాలు
● బాధితులంతా చైన్నె వాసులు
కొడవలూరు: టాటా ఏస్‌లో పెళ్లికెళ్లి.. తిరిగి సొంతూరికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని నాయుడుపాళెం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చైన్నెకి చెందిన వారు కావలిలో ఆదివారం రాత్రి జరిగిన పెళ్లికి టాటా ఏస్ వాహనంలో వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక అదే వాహనంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చైన్నెకి బయలుదేరారు. కొడవలూరు మండలం నాయుడుపాళెం వద్దకు రాగా ఇక్కడ ఆగిఉన్న టిప్పర్‌ను టాటాఏస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ నడుపుతున్న హుస్సేన్ (38), పక్క సీట్లో కూర్చున మాధవరావు (55)లు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కులో కూర్చున్న సుందరం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా చైన్నె వాసులే. సుందరాన్ని నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పెళ్లికెళ్లొస్తూ కానరాని లోకాలకు..