
ప్రభుత్వ భూమిలో జామాయిల్ నరికివేత
● విలువ సుమారు రూ.15 లక్షలు
● రెవెన్యూ అధికారుల పాత్రపై ప్రచారం
● అధికార పార్టీ అండతోనే..
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు – ఉదయగిరి హైవే మార్గంలో వింజమూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 839లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న జామాయిల్‌ను అక్రమార్కులు నరికి సొమ్ము చేసుకున్నారు. మూడురోజుల క్రితం వింజమూరుకు చెందిన ఓ వ్యాపారి జామాయిల్ కర్రను పట్టపగలే నరికించి వాహనాల్లో తరలించినట్లుగా తెలిసింది. దీని విలువ సుమారు రూ.15 లక్షలని చెబుతున్నారు. ఈ తంతు వెనుక రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రచారం ఉంది. తహసీల్దార్ కార్యాలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూమిలో జామాయిల్ నరికి తరలిస్తున్నా అధికారులు మాకు తెలియదని చెప్పడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ వారి పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్ ఎస్‌కే హమీద్‌ను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపామన్నారు. జామాయిల్ నరికిన మాట వాస్తవమేనన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఆ భూముల్లోనే సోమవారం పొట్టును వాహనంలో తరలిస్తున్నా రెవెన్యూ సిబ్బంది వదిలేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.