
గిరిజనులకు రాజకీయ నమ్మక ద్రోహం
కోవూరు: ‘రాణి తలుచుకుంటే.. గంటల వ్యవధిలో జీఓలే మారిపోతాయి’. అధికార యంత్రాంగం సైతం రిజర్వేషన్ నిబంధనలకు పాతరేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. అత్యధిక గిరిజన జనాభా ఉన్న కోవూరు నియోజకవర్గంలో రాజ్యాంగం నిర్దేశించిన రొటేషన్ విధానంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి ఈ దఫా గిరిజనులకు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఈ పదవిని ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్ ఖరారు చేస్తూ కలెక్టర్ ఆనంద్ ఆర్‌సీ నంబరు 168/ఎస్‌ఎంఏ/2024 ప్రకారం ఈ నెల 14వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు బయటకు వచ్చిన కొద్ది సేపటికే అదే ఉత్తర్వును సవరిస్తూ కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవిని ఓసీ జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. దీని వెనుక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రాంగం నడిపారని కలెక్టరేట్‌లోని విశ్వసనీయ వర్గాల తెలిసింది.
రాజకీయంగా ఎదగడం ఇష్టంలేకే..
అనేక సంవత్సరాల తర్వాత రొటేషన్ విధానంలో మొదటగా గిరిజనులకు వచ్చిన అవకాశాన్ని చివరి నిమిషంలో రద్దు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేవలం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు. రైతుల జీవితాలతో ముడిపడి ఉండే ఈ పదవి ఎంతో ప్రభావవంతమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే ఈ పదవి గిరిజన నేతలకు దక్కి ఉంటే రాజకీయాల్లో వారి ప్రాతినిథ్యం పెరిగేది. కానీ దాన్ని అడ్డుకుని మళ్లీ సంపన్న వర్గాలకే కట్టబెట్టడం ద్వారా గిరిజనుల ఎదుగుదలకు సమాధి కట్టినట్టే అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం గిరిజనులపై ప్రేమ చూపించే ప్రభుత్వానికి, పదవులు మాత్రం పెత్తందార్లకే కట్టబెట్టడంపై స్థానిక గిరిజన నేతలు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు ఓటు వేయడానికి మాత్రమేనా? అధికారంలో భాగస్వామ్యం కోసం కాదా? అంటూ నిలదీస్తున్నారు. మాటల్లో గిరిజన సంక్షేమం అంటూ నినదించే అధికార కూటమి, ఆచరణలో మాత్రం నమ్మక ద్రోహం చేస్తోందని వాస్తవం మరోసారి బయటపడింది.
విడవలూరు టీడీపీ నేతకు కట్టబెట్టేందుకే..
కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పదవిపై టీడీపీలోని అగ్రకుల నేతలు కన్నేశారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గాల్లో కోవూరు ఒకటి. వాస్తవంగా కోవూరు ఏఎంసీ పదవి రొటేషన్ పద్ధతిలో ఈ దఫా గిరిజనులకు కేటాయించాల్సి ఉంది. ఈ పదవిని దక్కించుకునేందుకు రాజకీయ కుతంత్రాలకు తెరతీశారు. ఈ పదవికి ఎంతో మంది పోటీపడుతున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన విడవలూరు మండలానికి చెందిన ఓ నేతకు ఈ పట్టం కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చక్రం తిప్పారని స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది. కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయిస్తూ సాక్షాత్తు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు.. మరి కొద్ది సేపటికే మార్చేస్తూ ఈ పదవిని ఓసీ జనరల్‌కు కేటాయించడం వెనుక రాజకీయ ఒత్తిడి కనిపిస్తోందని స్పష్టమవుతోంది.
ఎమ్మెల్యే ఆదేశాలతో
రిజర్వేషన్‌కు పాతర
గంట వ్యవధిలోనే ఓసీ జనరల్ చేస్తూ మరో ఉత్తర్వు
గిరిజన హక్కులను కాలరాస్తూ
చక్రం తిప్పిన వైనం
ఓట్ల కోసమే వారిపై ప్రేమ..
పదవులు మాత్రం పెత్తందార్లకు
ఏఎంసీ రిజర్వేషన్ మార్పుపై
గిరిజన సంఘాల మండిపాటు
కూటమి నేతల కుట్ర రాజకీయాలపై ఉద్యమించాలని నిర్ణయం
ఏఎంసీ పీఠం కోసం తమ్ముళ్ల మధ్య పోటీ
కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంతో మంది ఆశావహులు ఈ దఫా గిరిజనులకే దక్కుతుందని భావించి సైలెంట్ అయిపోయారు. తాజాగా ఏఎంసీ పీఠం ఓసీ జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో నియోజకవర్గంలోని ఆశావహులు ఆ పదవిని దక్కించుకునేందుకు పైరవీలు చేసుకుంటున్నారనే సమాచారం. కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటి ముందు క్యూకడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి పదవి కట్టబెట్టినా మరొకరు అలకబూనే అవకాశం ఉండడంతో ఈ పరిణామాలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి తలనొప్పిగా పరిణమించాయి.
కోవూరు ఏఎంసీ గిరిజనులకు కేటాయిస్తూ తొలుత ఉత్తర్వులు
అధికార పీఠం కోసం గిరిజన జపం చేసే పాలకులు అధికారం దక్కగానే తమ స్వప్రయోజనాల కోసం అగ్రకుల సంపన్నులకు కట్టబెట్టేందుకు గిరిజనులకు నమ్మక ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలకు కోవూరు వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఉదాహరణగా నిలుస్తోంది. చరిత్రాత్మకంగా గిరిజనులకిచ్చే అవకాశాన్ని అడ్డుకోవడం, వారిని మరోసారి పక్కన పెట్టడం మాత్రమే కాకుండా, వారి భవిష్యత్‌కు సమాధి చేయడమే అని గిరిజనులు, ఆ సంఘ నాయకులు మండిపడుతున్నారు. కూటమి నేతల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనలకు చేస్తున్న రాజకీయ ద్రోహంపై ప్రజాక్షేత్రంలో ఉద్యమించడానికి గిరిజన సంఘాలు ఉద్యుక్తమవుతున్నాయి.

గిరిజనులకు రాజకీయ నమ్మక ద్రోహం

గిరిజనులకు రాజకీయ నమ్మక ద్రోహం

గిరిజనులకు రాజకీయ నమ్మక ద్రోహం