
ఘనంగా వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
వెంకటాచలం: గొలగమూడిలో కొలువైన భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ, అభిషేకం, రక్షాబంధన పూజ, దీక్ష వస్త్ర సమర్పణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సర్వభూపాల, కల్పవృక్ష వాహనసేవలను నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవాన్ని జరిపారు. గొలగమూడి గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు.
ఉత్సవాల్లో నేడు
ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలను మంగళవారం నిర్వహించనున్నారు.
కాకాణికి
హైకోర్టులో ఊరట
● రుస్తుం మైనింగ్ కేసులో బెయిల్
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. రుస్తుం మైన్‌లో జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను ఉపయోగించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని నెల్లూరు రూరల్ డీఎస్పీ విచారణాధికారిగా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ (ఎస్‌సీ, ఎస్టీ) కేసులో కాకాణి 4వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాకాణి బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు ఓ మనోహర్ రెడ్డి, చేజర్ల శుబోద్ తమ వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఒక్కొక్కరు రూ. 2 లక్షలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్‌దారులు పూచీకత్తు సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి నెల్లూరు జిల్లాలో ఉండకూడని, పాస్ పోర్టు సరెండర్ చేయాలని, ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు విచారణాధికారి వద్ద హాజరు కావాలని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్లడానికి వీల్లేదని, కేసు విషయాలపై మీడియాతో మాట్లాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.