
రైల్లోంచి జారిపడి ముగ్గురి దుర్మరణం
గుర్తుతెలియని వ్యక్తి..
కావలి (జలదంకి): రైల్లోంచి జారిపడటంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కావలి రైల్వేస్టేషన్ పరిధిలోని ముసునూరు సమీపంలో దిగువ లైన్లో చోటుచేసుకుంది. కావలి రైల్వే ఎస్సై వెంకట్రావ్ వివరాల మేరకు.. మృతుడు తెలుపు చొక్కా, తెలుపు రంగు కట్ బనియన్, బ్లూ ప్యాంట్‌ను ధరించి ఉన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కావలి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు 94406 27648 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాల్లో రైల్లోంచి జారి పడి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు, కావలి సమీపంలో జరిగిన ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మరణించారు.
తలుపు వద్ద మాట్లాడుకుంటూ..
నెల్లూరు(క్రైమ్): రైల్లోంచి ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన పోలయ్య (24), అర్షద్ (19), వెంకటేష్ స్నేహితులు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ క్లీనర్‌గా పోలయ్య.. మెకానిక్‌గా అర్షద్ పనిచేస్తున్నారు. స్నేహితుడి తమ్ముడి కుమార్తె ఫంక్షన్ నిమిత్తం విజయవాడకు ఈ నెల 14న రైల్లో వీరు బయల్దేరారు. బోగీ తలుపు వద్ద పోలయ్య, అర్షద్ కూర్చొని మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో కొండాయపాలెం గేట్ సమీపంలో వీరి జారిపడ్డారు. కొద్దిసేపటికి వీరు కనిపించకపోవడంతో నెల్లూరులో రైలు దిగి చుట్టుపక్కల వెంకటేష్ గాలించారు. అనంతరం చెన్నూరెళ్లి జరిగిన విషయాన్ని స్నేహితుల కుటుంబసభ్యులకు తెలియజేశారు. అందరూ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే పోలీసులకు ఓ మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కొండాయపాళెం గేట్ సమీపంలోని చెట్లలో దుర్గంధం వస్తుండటాన్ని రైల్వే సిబ్బంది శనివారం గమనించారు. పరిశీలించగా మృతదేహం కనిపించింది. ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు.. అర్షద్‌గా గుర్తించారు. ఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అక్కడే ఉన్న మరో మృతదేహాన్ని బాధిత కుటుంబసభ్యులకు చూపించగా అది పోలయ్యదని గుర్తించారు. రైల్వే ఎస్సై హరిచందన దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అర్షద్, పోలయ్య (ఫైల్)

రైల్లోంచి జారిపడి ముగ్గురి దుర్మరణం

రైల్లోంచి జారిపడి ముగ్గురి దుర్మరణం