
అంతా అయోమయం
ఉచిత బస్సు ప్రయాణం కొందరికే..
నెల్లూరు సిటీ: ఏడాదికిపైగా ఊరించిన ఉచిత బస్సు పథకం ఉస్సూరుమనిపిస్తోంది. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూనే కొర్రీలు, మెలికలు పెట్టి షరతులు విధించింది. కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయదు. ఒక వేళ చేస్తే మాత్రం ప్రచారం ఆర్భాటంగా ఉంటుంది. ఉపయోగం మాత్రం ఉండదు అనేదానికి సీ్త్రశక్తి (ఉచిత బస్సు పథకం) ఉదాహరణగా నిలుస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణం ఉచితం అంటూనే ఆయా రూట్లలో తొలి రోజునే సర్వీసులు కుదించేసింది. ఇక ఒక ఎక్స్‌ప్రెస్‌లో ఉచితం, మరో ఎక్స్‌ప్రెస్‌లో సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టడం చూసి ప్రయాణికులు నివ్వెరపోతున్నారు. ప్రస్తుతానికి రద్దీ లేకపోవడంతో పరిస్థితి ఏమిటనేదా ఇంకా అర్థం కాలేదు. రెండు.. మూడు రోజులు గడిస్తే కానీ ఎలా ఉంటుందో చెప్పలేమంటూ ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.
ఘాట్ రూట్ బస్సుల్లో టికెట్ కొనాల్సిందే..
జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి రాజంపేట మధ్య ప్రతి రోజు 10 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. నెల్లూరు డిపో–1 నుంచి 5 బస్సులు, రాజంపేట డిపో నుంచి 5 బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఘాట్ రూట్‌లో నడిచే ఈ బస్సు సర్వీసుల్లో సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది.
ఇంటర్ స్టేట్ బస్సుల్లోనూ అంతే..
నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు డిపోల నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుపుతున్నారు. ఇవి ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదని చెబుతున్నారు. నెల్లూరు నుంచి చైన్నె వెళ్లే బస్సులు గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ ప్రధాన స్టాపింగ్‌లు ఉన్నాయి. కనీసం నెల్లూరులో ఎక్కి గూడూరులో దిగాలన్నా.. గూడూరులో ఎక్కి నాయుడుపేటలో దిగాలన్నా.. సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ చెబుతున్నారు. ఈ బస్సుల్లో కనీసం జిల్లా పరిధిలోనూ ప్రయాణించేందుకు అవకాశం లేకపోవడంతో మహిళా ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. అన్ని డిపోల నుంచి తిరిగే బస్సుల్లోనూ ఇవే నిబంధనలు వర్తించడంతో మహిళల ప్రయాణానికి ఉపయోగపడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గూడూరు వరకే ఆర్డినరీలు..
నెల్లూరు నుంచి నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, సూళ్లూరుపేట, తడ వరకు వెళ్లే ప్రయాణికులకు ఆర్డినరీ బస్సులే లేవు. నెల్లూరు నుంచి గూడూరు వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి నాయుడుపేట వైపు ఆర్డి నరీ బస్సులే లేవు. ఇటు దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, అటు పెళ్లకూరు, శ్రీకాళహస్తి, తిరుపతికి వెళ్లాంటే ఉచిత ప్రయాణం దుర్లభమే. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చంటూ చంద్రబాబు అండ్ కూటమి కో చేస్తున్న ఆర్భాటంగా చేసిన ప్రచారానికి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఉచిత బస్సు అంటూనే షరతులు వర్తిస్తాయంటూ ‘కూటమి’ మార్కుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఒరిజినల్ కార్డు లేకపోతే టికెట్ కొనాల్సిందే..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఆంక్షలతో మహిళలకు ఉచిత ప్రయాణం లేకుండా కొత్త ఎత్తులు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను చూపించాలని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆయా కార్డులు తప్పనిసరిగా ఒరిజనల్ కార్డు చేత పట్టుకుని రావాలని కండక్టర్లు హెచ్చరిస్తున్నారు. జెరాక్స్‌లు, ఫోన్‌లో కార్డులను చూపిస్తే చెల్లుబాటు కావని అధికారులు తెలుపుతున్నారు.
ఉదయగిరి: ఉదయగిరి డిపో పరిధిలో ఉన్న 57 బస్సుల్లో 39 సర్వీస్‌ల్లోనే సీ్త్ర శక్తి పథకం వర్తిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పిన చంద్రబాబు అమల్లోకి వచ్చే సరికి కేవలం కొన్ని సర్వీసులకు మాత్రమే వర్తింప చేస్తూ మోసం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి డిపో నుంచి 5 సర్వీసులు చైన్నెకు వెళ్తున్నా.. వీటిల్లో ఉచిత ప్రయాణం అమలు చేయడం లేదు. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. కనీసం జిల్లా, రాష్ట్ర పరిధిలోనూ ఉచితంగా ప్రయాణించే వీలు లేదనడం విడ్డూరమని మహిళలు మండి పడుతున్నారు. ఉదయగిరి డిపో నుంచి నెల్లూరుకు ఉదయం 7.30 గంటల తర్వాత 9 గంటల వరకు ఉచితంగా ప్రయాణించేందుకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులే లేవు. ఈ సమయంలో చైన్నె సర్వీ సు ఉన్నప్పటికీ టికెట్ కొని ప్రయాణించాల్సిందే. ఉన్న బస్సులు కుదించి ఉచిత ప్రయాణం అంటే ఎలా అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి డిపో నుంచి సాయంత్రం 7 గంటల తర్వాత నెల్లూరు వైపు వెళ్లే సర్వీసులు చైన్నెకు వెళ్లేవి కావడంతో టికెట్లు కొని ప్రయాణించాల్సిందే. అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 90 శాతం పల్లెలకు బస్సులు లేవు. మరి పల్లెల్లో ఉండే మహిళలకు ఉపయోగం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే ఎరుక. ఉదయగిరి నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఉచిత సర్వీసు కూడా లేదు. మరి ఆ సమయం తర్వాత వెళ్లే మహిళలు తిరిగే బస్సుల్లో టికెట్లు కొని ప్రయాణించాల్సిందే. ఉదయగిరి నుంచి నెల్లూరు, కావలి, బద్వేల్, పామూరు వైపు వెళ్లే ఫ్రీ సర్వీసులు పరిమితంగా ఉండడంతో ఉదయగిరిలోనే బస్సులు నిండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టేజీల్లో ఎక్కే ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయాల్సిందే. ఉచిత సర్వీసులు పెంచితే ఈ సమస్య ఉండదు.
ఆత్మకూరురూరల్: కూటమి ఆర్భాటంగా ప్రచారం చేసుకొని ప్రారంభించిన సీ్త్రశక్తి ఉచిత బస్సు పథకంపై మహిళల్లో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణించవచ్చని ఇటీవల ప్రభుత్వం విధి విధానాలు ప్రకటిస్తూ ఆర్భాటంగా చెప్పింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వయా అన్నవరం వరకు మహిళలు ఉచిత బస్సుల్లో వెళ్లి తీర్థయాత్రలు చేసుకోవచ్చని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మహిళలు గుర్తు చేసుకున్నారు. వాస్తవంలోకి వస్తే అనేక ఆంక్షలు, కొర్రీలతో ప్రయాణానికి అడ్డంకులు సృష్టించిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో మొత్తం 67 బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఆత్మకూరు డిపో నుంచి చైన్నె, బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో జిల్లా పరిధిలో కానీ, రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలకు ప్రయాణించడానికి సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ నిబంధనలు విధించారు. ఇక పల్లెవెలుగు బస్సుల్లోనూ కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
బస్సుల్లో షరతులు వర్తిస్తున్నాయి
కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్టీసీ ఫ్రీ బస్సుల్లో షరతులు వర్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూనే మెలికలు పెట్టింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది. ఆర్టీసీ బస్సుల్లో పెట్టిన నిబంధనలతో డిపో నుంచి డిపో వరకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు–కావలి, నెల్లూరు– గూడూరు మధ్య నడిచే బస్సులన్నీ ఎక్స్‌ప్రెస్‌లే అయినా నాన్‌స్టాప్ సర్వీస్‌లో ఉచితం లేదంటూ షరతులు అమలు చేస్తోంది. జిల్లాలోని డిపోల నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ రాష్ట్ర పరిధి వరకు కాదు కనీసం జిల్లా పరిధిలోనూ సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. ప్రధానంగా నెల్లూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేటకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచితం లేదంటూ నిబంధనలు పెట్టింది.
ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఎక్కలేరు
నెల్లూరు టు రాజంపేట బస్సులో
సీ్త్రశక్తి వర్తించదు
జిల్లా నుంచి వెళ్లే ఇంటర్ స్టేట్ బస్సుల్లోనే ఇదే రూల్
నాన్‌స్టాప్ సర్వీస్‌ల్లోనూ అంతే
అన్నీ నాన్‌స్టాప్‌లే..
వీటిల్లోనూ ఇదే రూల్
నెల్లూరు– కావలి, నెల్లూరు–గూడూరు మధ్య ఎక్స్‌ప్రెస్ బస్సులను నాన్‌స్టాప్ చేశారు. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. వీటిల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదంటూ ఆంక్షలు పెట్టారు. ఇక నెల్లూరు నుంచి తిరుపతికి కూడా అన్నీ నాన్‌స్టాప్‌లే వీటిల్లోనూ ఎక్కి వీలులేకపోవడంతో మహిళలు ఉస్సూరుమంటున్నారు. ఉన్న అరకొర బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌లోనూ ఉచిత ప్రయాణానికి కొర్రీలు, మెలికలు పెడుతోంది.
ఫ్రీ టికెట్ .. కొన్ని బస్సుల్లోనే..
కూటమి ప్రభుత్వం ఈ నెల 15న సాయంత్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం శనివారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అయితే ఆంక్షలు మహిళా ప్రయాణికులకు అయోమయం, గందగోళంగా మారింది. జిల్లాలోని 7 ఆర్టీసీ డిపోల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 492 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆత్మకూరు డిపో పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కలిపి 61 బస్సులు, కందుకూరు డిపో పరిధిలో 60, కావలిలో 90, నెల్లూరు–1 డిపో పరిధిలో 91, నెల్లూరు–2 డిపో పరిధిలో 90, రాపూరు డిపో పరిధిలో 49, ఉదయగిరి డిపో పరిధిలో 51 బస్సులను మహిళల ప్రయాణానికి ఏర్పాటు చేశారు. ఏ బస్సుల్లో ఫీ ఉందో.. ఏ బస్సులో లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. శనివారం నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ మహిళలకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. చాలా మంది మహిళలు ఆయా బస్సుల్లోకి ఎక్కాక.. ఈ బస్సులో టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్లు చెప్పడంతో దిగేస్తూ.. కూటమి ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడడం కనిపించింది. శనివారం నెల్లూరు నుంచి వాకాడుకు వెళ్లేందుకు వాకాడు డిపోకు చెందిన ఓ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్లాట్‌ఫాం మీదకు వచ్చింది. అందులో ప్రయాణికులు ఎక్కాక కదిలి వెళ్లిపోయింది. వెంటనే అదే రూట్లో నడిచే మరో ఎక్స్‌ప్రెస్ బస్సును ప్లాట్‌ఫాం మీదకు తెచ్చారు. ప్రయాణికులు అందులోకి ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ బస్సులో మహిళలు టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇదీ ఎక్స్‌ప్రెస్.. అదీ ఎక్స్‌ప్రెస్సే కదా అని బస్సు సిబ్బందిని అడిగితే మాకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు.
ప్రచారమే తప్ప ప్రయోజనం శూన్యం
మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రచారం తప్ప.. ఆచరణ, ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అయితే ఎటువెళ్లిన పాతిక, ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశమే లేదు. పల్లెవెలుగుల్లోనే ప్రయాణించాలంటే.. డీసీపల్లి నుంచి నెల్లూరుకు రెండు బస్సులు మారి పోవాల్సిందే. రాష్ట్ర పరిధి దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని చెప్పడం మహిళలను మోసం చేయడమే. కనీసం ఆ బస్సుల్లో రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలకు కూడా వెళ్లకూడదని పేర్కొనడం మరీ విడ్డూరం.
– రెడ్డి శాంతమ్మ, డీసీపల్లి, మర్రిపాడు

అంతా అయోమయం

అంతా అయోమయం

అంతా అయోమయం

అంతా అయోమయం

అంతా అయోమయం

అంతా అయోమయం

అంతా అయోమయం