
తమిళ బోట్లను తరిమికొడుదాం
● జువ్వలదిన్నెలో నాలుగు జిల్లాల్లోని 134 మత్స్యకార గ్రామాల కాపుల సమావేశం
● పట్టుబడిన కడలూరు, కారైకల్ బోట్లను గస్తీకి వినియోగించాలని నిర్ణయం
బిట్రగుంట: రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాల్లో మత్స్య సంపదను కొల్లగొడుతూ తీరప్రాంత గ్రామాలకు ఉపాధి లేకుండా చేస్తున్న తమిళనాడు బోట్లను సమష్టిగా అడ్డుకోవాలని నాలుగు జిల్లాల మత్స్యకార గ్రామాల కాపులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తమకు పట్టుబడి జువ్వలదిన్నె హార్బర్‌లో ఉన్న కడలూరు, కారైకల్ బోట్లను గస్తీకి వినియోగించాలని నిర్ణయించారు. మత్స్యకార గ్రామకాపుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని మత్స్యకార కాపులు జువ్వలదిన్నెలో శనివారం రెండో విడత సమావేశమయ్యారు. పెద్దబోట్లు, వలలతో వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారుల ఉపాధికి గండికొడుతున్న తమిళనాడు బోట్లను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం, మైరెన్ పోలీస్‌లు ఎవరూ చొరవ తీసుకోవడం లేదని, ఫలితంగా స్థానిక మత్స్యకారులపై దాడులు చేయడం, వలలు ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ పదేళ్ల నుంచి తమిళనాడు బోట్లు (పెద్ద బోట్లు) రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని తీరంలో వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నాయన్నారు. పెద్ద వలలు, నిషేధిత వలలతో వేట సాగిస్తూ చిన్నచిన్న చేపలను కూడా పట్టుబడి చేస్తుండడంతో పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోయి మత్స్యసంపద లభించడం కష్టంగా మారిందన్నారు. వీరు వేట సాగించే సమయంలో స్థానిక మత్స్యకారుల వలలు, పడవలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. మత్స్య సంపదకు చేటు తెస్తున్న తమిళనాడు బోట్లను అడ్డుకోవాలని పదేపదే అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో 2023లో సుమా రు వంద గ్రామాల కాపులతో ఇస్కపల్లిలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జూలై 31న ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం సమీపంలో తీరానికి చొచ్చుకు వచ్చి వేట సాగిస్తున్న కడలూరు, కారైకల్ బోట్లను స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారని వివరించారు. ఈ బోట్లను స్వాధీనం చేసుకుని జువ్వలదిన్నె హార్బర్‌కు చేర్చడం జరిగిందన్నారు. పట్టుబడిన ఈ బోట్లనే గస్తీకి వినియోగించి తమిళనాడు బోట్లను పూర్తిగా అడ్డుకోవాలని తాజా సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశా రు. తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని లక్ష్యంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.