
తెలుగు రాష్ట్రాల్లో మనమే వ్యాపారం చేయాలి
● ఏపీ ఎడిబుల్ ఆయిల్స్
అసోసియేషన్ అధ్యక్షుడు
ముత్తుకూరు (పొదలకూరు) : రెండు తెలుగు రాష్ట్రాల్లో మనమే వ్యాపారం చేసుకుంటే తద్వారా ప్రభుత్వాలతోపాటు, వ్యాపారులకు ఆదాయం వస్తుందని ఏపీ ఎడిబుల్ ఆయిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి అన్నారు. ముత్తుకూరు మండలం పంటపాళెంలో శనివారం అసోసియేషన్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారుల వల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతున్నట్టు అభిప్రాయపడ్డారు. పంటపాళెంలోని పామాయిల్ ఫ్యాక్టరీల నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులు బల్క్‌గా 5 వేలు, 10 వేల టన్నుల పామాయిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధరల్లో తేడాలు వచ్చిన సమయంలో వారే మనకు విక్రయిస్తున్నందున వ్యాపారులు నష్టపోతున్నారని వెల్లడించారు. ఈ అంశంపై తమ అసోసియేషన్ సుదీర్ఘంగా చర్చలు జరిపి ఎలా అధిగమించాలనే ఆలోచనలతో కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. గత నెల 29న కడపలో వ్యాపారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఈ నెల 1 నుంచి ఏపీ బ్రోకర్స్ ద్వారా వర్తకులు రీ–సేల్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బిల్స్ ఉంటేనే పామాయిల్ కొనుగోలు చేసే విధంగా వ్యాపారులకు తెలియజేశామన్నారు. లోకల్ ట్రేడ్ సర్వీస్ వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటహరినాథ్, ట్రెజరర్ చక్రపాణి తదితరులు మాట్లాడారు.
‘చలో కరేడు’ పోస్టర్లు
తొలగించడం దారుణం
● ఇది ఎమ్మెల్యే, పోలీసుల దుశ్చర్య
● ప్రజాస్వామ్యాన్ని
కాలరాస్తోన్న కూటమి ప్రభుత్వం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఉలవపాడు మండలం కరేడు రైతులకు మద్దతుగా ఈ నెల 18న ‘చలో కరేడు’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యేతో కలిసి పోలీసులు దుర్చశ్యకు పాల్పడ్డారని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఆరోపించారు. శనివారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుని ప్రైవేట్ సోలార్ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని ఈ చర్యను నిరసిస్తూ వామపక్షాలు, పలు రైతు సంఘ నాయకులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ‘చలో కరేడు’ కార్యక్రమ ప్రచార పోస్టర్లను ఆ గ్రామంతోపాటు సమీప ప్రాంతాల్లోనూ గోడల కు అంటించామన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు కరేడులో ఏర్పాటు చేసిన పోస్టర్స్‌ను శనివారం రాత్రి తొలగించారన్నారు. శనివారం రాత్రి ‘చలో కరేడు’ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న స్థానికుడైన అంకమరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. విజయ్‌కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు యత్నించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసన తెలిపే హక్కులను కాలరాసే దుశ్చర్యలను ప్రభుత్వ పెద్దలు, పోలీసులు మానుకోకపోతే ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు ప్రతిఘటన మరో స్థాయిలో చూడాల్సి వస్తుందని రమేష్ హెచ్చరించారు. పోస్టర్లు తొలగించినంత మాత్రాన ఉద్యమాన్ని అణిచి వేయలేరని, రైతులను, ప్రజలను రెచ్చగొట్టితే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.
శ్రీకృష్ణుడిగా
లక్ష్మీ నరసింహుడు
రాపూరు: మండలంలోని పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి శనివారం రాత్రి భక్తులకు శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారి అలంకార మండపంలో శేషవాహనంపై పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీ ఉత్సవర్లను కొలువుదీర్చారు. స్వామివారిని శ్రీకృష్ణుడిగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోన మాఢవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవి గ్రహాలకు పాలు, తేనే, పెరుగు, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్నపన తిరుమంజనం, హోమం, కల్యాణం నిర్వహించారు. సా యంత్రం ఉట్టి మహోత్సవం నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో మనమే వ్యాపారం చేయాలి