
సగర్వంగా.. త్రివర్ణ వీచికలు
నెల్లూరు (అర్బన్): సంక్షేమంతోపాటు అభివృద్ధే ధ్యేయంగా జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం శాంతికపోతాలను, బెలూన్లను ఎగుర వేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర సాధన కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామన్నారు. ఈ ప్రణాళికలో ప్రథమ లక్ష్యమైన పీ4 విధానం ద్వారా జిల్లాలో 38,465 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
సమగ్రాభివృద్ధికి కృషి
జిల్లాలోని రైతులకు అండగా అన్నదాత సుఖీభవ పథకం కింద 1.96 లక్షల మందికి రూ.132 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 1,454 రైతులకు రూ.6.8 కోట్ల విలువైన యంత్రపరికరాలను రూ 2.83 కోట్ల సబ్సిడీతో అందించామన్నారు. 80 శాతం సబ్సిడీతో 33 వ్యవసాయ డ్రోన్లను సరఫరా చేశామన్నారు. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్– ఆయిల్ పామ్ పథకం కింద రూ.7.62 కోట్ల రాయితీని 3,685 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 14,820 ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్య పరికరాలను అమర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. మెట్ట ప్రాంత వరప్రదాయిని ఆనం సంజీవరెడ్డి సోమశిల ఎత్తిపోతల పథకం ఫేజ్–1 కింద రూ.854 కోట్ల అగ్రిమెంట్‌కు రూ.533 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ద్వారా రూ.15 కోట్లతో చేపట్టిన 244 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు 850 ఎకరాల విస్తీర్ణంలో రామాయపట్నంపోర్టు రూ.3,700 కోట్లతో నిర్మాణంలో ఉందన్నారు. ఆరు వేల మంది ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రూ.37.26 కోట్లతో 1.62 లక్షల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 2.90 లక్షల మందికి రూ.434.56 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.
పరిశ్రమల స్థాపనకు చేయూత
జిల్లాలో 42 భారీ పరిశ్రమలు, రూ.41 వేల కోట్ల పెట్టుబడితో 19 వేల మందికి ఉపాధి కల్పిస్తూ స్థాపించామన్నారు. 53 వేల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రలు ఉన్నాయన్నారు. వీటన్నింటికి ప్రభుత్వం పరంగా చేయూతనిస్తున్నామన్నారు. ఆత్మకూరు నారంపేట వద్ద 173.67 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి పరిచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం 789 ప్లాట్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జేసీ కార్తీక్, డీఆర్వో హుస్సేన్‌సాహెబ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, పావని తదతరులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం
ఘనంగా 79వ స్వాతంత్య్ర
దినోత్సవ వేడుకలు
స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిన ప్రదర్శనలు
విశిష్ట సేవలందించిన 332 మందికి అవార్డుల ప్రదానం
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి:
మంత్రి నారాయణ
గర్వగాథలతో స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఆకాశ వీధుల్లో మువ్వన్నెల వీచికలు దేశపు గర్వ ధ్వజమై రెపరెపలాడాయి. త్రివర్ణ తరంగం తరం తరం గౌరవానికి ప్రతీకగా.. వీధివీధిన అలరారగా, పట్టణం నుంచి పల్లె వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో దేశభక్తి గర్వగీతమై ఉప్పొంగింది. పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి నారాయణ, కలెక్టర్, ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. చిన్నారులు మహనీయుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరు (క్రైమ్): దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారి త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు. శుక్రవారం79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ క్యాంపు, జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో సిబ్బంది విధులకు పునరంకితం కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కుటుంబ సభ్యులు, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్‌బీ డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వెంకటాచలం మండలం చెముడుగుంటలోని డీటీసీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిధర్‌రావు, ఇన్‌స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, ఆర్‌ఐ డి. శ్రీనివాసరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సగర్వంగా.. త్రివర్ణ వీచికలు

సగర్వంగా.. త్రివర్ణ వీచికలు