విద్యార్థుల ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆకలి కేకలు

Aug 16 2025 8:17 AM | Updated on Aug 16 2025 8:17 AM

విద్యార్థుల ఆకలి కేకలు

విద్యార్థుల ఆకలి కేకలు

ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో..

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పట్టణంలో డీఎల్‌ఎన్నార్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ఉదయం నుంచి కనీసం అల్పాహారం కూడా లేక అలమటించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులందరూ అల్పాహారం కూడా తినకుండా ఉదయం 7 గంటలకే వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులు గ్రౌండ్‌కు చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రావడం ఆలస్యం కావడంతో ఆమె కోసం ఎదురు చూసి చూసి అసహనానికి గురయ్యారు. దాదాపు 10 గంటలకు మొదలైన కార్యక్రమం 1.10 గంటల వరకు సాగింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదు. ఇంకేం చేయలేక ఆకలి కేకలతోనే విద్యార్థులు వెనుదిరిగారు. సాంస్కతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం మిగిలి ఉండగానే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ, కమిషనర్‌, కౌన్సిలర్లు విద్యార్థులు, ఉద్యోగులకు అవార్డులు అందజేశారు.

సీ్త్ర శక్తి పథకం ప్రారంభం

నెల్లూరు సిటీ: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో సీ్త్ర శక్తి పథకాన్ని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి నవాబుపేట వరకు ర్యాలీగా ప్రారంభమైన బస్సుల్లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కార్తీక్‌, ఆర్టీసీ రీజియన్‌ చైర్మన్‌ సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, నుడా చైర్మన్‌ శ్రీనివాసులరెడ్డి, నాయకులు గిరిధర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నందన్‌, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌, ఆర్టీసీ ఈడీ నాగేంద్రప్రసాద్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి షమీమ్‌ ప్రయాణించారు. కాగా ఈ పథకానికి సంబంధించి మహిళల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.

సాంఘిక సంక్షేమ శాఖకు దక్కని ప్రశంసలు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలోని 71 ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన 332 మందికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలను అందజేశారు. అయితే జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, సోషల్‌ వెల్ఫేర్‌ రెండింటికి ఒక్కటంటే ఒక్క ప్రసాంశ పత్రం కూడా రాలేదు. ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం తాండవిస్తున్న నేపథ్యంలో ఈ దఫా ఈ శాఖలో ఏ ఉద్యోగికి కూడా ప్రశంసలు లేవంటే, విశిష్ట సేవలు దేవుడు ఎరుగు కనీస సేవలు కూడా అందించలేదని స్పష్టమవుతోంది. సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా, కార్పొరేషన్‌ ఈడీగా ఒకరే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సంక్షేమ శాఖలో 71 హాస్టళ్లల్లో 71 వార్డెన్లు, నలుగురు ఏఎస్‌డబ్ల్యూఓలు, కార్యాలయంలో 15 మందికి పైగా, కార్పొరేషన్‌ కార్యాలయంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 150 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయినా ఒక్కరికీ కూడా స్వాతంత్య్ర దినోత్సవ ప్రశంస అందలేదంటే ఆ శాఖ పనిచేస్తున్న తీరుపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారి వద్ద నుంచి వార్డెన్ల పనితీరు, ఇటీవల ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన ఆరోపణలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై వ్యవహరిస్తున్న తీరు ఇందుకు కారణమై ఉండొచ్చు అని శాఖలో పనిచేస్తున్న వారే అంటున్నారు. ఈ విషయమై సోషల్‌ వెల్ఫేర్‌ డీడీకి ఫోన్‌ చేసినా స్పందించలేదు.

భారీగా గ్రావెల్‌

అక్రమ తవ్వకాలు

బిట్రగుంట: దగదర్తి, బోగోలు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం, కప్పరాళ్లతిప్ప సమీపంలోని పలు ప్రాంతాల్లో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. భారీ యంత్రాలు, టిప్పర్ల సాయంతో గ్రావెల్‌ తరలిస్తుండడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు సిండికేట్‌గా మారి రాత్రిళ్లు గ్రావెల్‌ తవ్వకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్‌, పోలీసుల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతోపాటు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులతోపాటు మీడియాకు ముడుపులు ముట్టచెబుతున్నామని చెబుతూ అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement