
జాతీయ పతాకానికి అవమానం
● జనార్ధనపురం పాఠశాలలో ఉల్టాగా కట్టి ఎగురవేసిన వైనం
వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండలం జనార్ధనపురం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. జాతీయ పతాకాన్ని ఉల్టాగా కట్టి ఎగువ వేయడంతో కషాయం కిందకు, ఆకు పచ్చ పైకి ఉండేలా ఎగురుతూ కనిపించింది. బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడు ఆవుల రాజు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జాతీయ పతాకం ఎగురవేసిన సమయంలో అయినా తప్పును గుర్తించి తిరిగి ఎగురవేయాల్సిన సదరు ఉపాధ్యాయుడు బాధ్యతారాహిత్యంగా జెండా వందనం చేయడం గమనార్హం. జాతీయ పతాకం ఎగురవేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చినిగిపోయినా, రంగు వెలిసిన జెండాలను వినియోగించకూడదనే తెలిసినా.. చివరన చినిగిపోయిన జెండానే ఎగురవేయడంతో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. జాతీయ జెండాకు అవమానం జరిగిన తీరును గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వింజమూరు ఎంఈఓ రమేష్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎంఈఓను వివరణ కోరగా, జెండా తిరగేసి కట్టిన మాట వాస్తవమే అని తెలిపారు. ఉన్నతాధికారులు అదేశాలు ఇస్తే విచారణ చేస్తామని తెలిపారు.