దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
● స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కుడుముల చిన్నమ్మ
దగదర్తి: వైస్ ఎంపీపీకి సోమవారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఉలవపాళ్ల ఎంపీటీసీగా ఉన్న కుడుముల చిన్నమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుపొందారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బరాజు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందరూ వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన వారే. టీడీపీకి ఒక్క ఎంపీటీసీ కూడా లేరు. ప్రస్తుతం ఎంపీపీగా తాళ్లూరు ప్రసాద్‌నాయుడు ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 11 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఇద్దరు వైస్ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో పీతల కామేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ పదవికి రాజీనామా చేయడంతో ఉపాధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. గతంలో నిర్వహించ తలపెట్టిన ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో చెన్నూరు ఎంపీటీసీ చలంచర్ల సుశీల ఇటీవల టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే తాజాగా వైస్ ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 10 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు. వీరిలో ఉలవపాళ్ల ఎంపీటీసీ సభ్యురాలు కుడుముల చిన్నమ్మ వైస్ ఎంపీపీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీకి ఎవరు ముందుకు రాకపోవడంతో చిన్నమ్మ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.


