పేదల ఇళ్ల నిర్మాణంపై కట్టుకథలు
● గత ప్రభుత్వ హయాంలో సజావుగా
● వీటిని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు పాకులాట
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో పేదలకు సంబంధించిన గృహ నిర్మాణాల్లో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు పతాక స్థాయికి చేరాయని.. తాను నిర్మించని ఇళ్లకు క్రెడిట్ కొట్టేసేందుకు ఆయన యత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆధారాలతో సహా స్పష్టం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ ఏడాదిన్నర పాలనలో నిర్మాణాలు జరగలేదని చెప్పారు. జిల్లాలో 19,678 గృహాలను నిర్మించి, పేదలకు కేటాయిస్తున్నామనే ప్రకటనల నేపథ్యంలో.. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు జరిగిన కన్‌స్ట్రక్షన్స్, మంజూరైన నిధులపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించామని వివరించారు. హౌసింగ్ అధికారులిచ్చిన సమాచారం మేరకు అర్బన్‌లో 2838ను కేటాయించగా, 2824 మొదలుకాలేదని.. 14 మాత్రం పునాది దశలో ఉన్నాయని.. నిధులు మంజూరు చేయలేదనే అంశం స్పష్టమైందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 44 ఇళ్లను ప్రతిపాదించగా, 23కు సంబంధించిన పనులు ప్రారంభంకాలేదని, వివిధ దశల్లో 20 ఉండగా, పూర్తయింది ఒకటి మాత్రమేనని, రూ.12 లక్షలనే విడుదల చేశారని పేర్కొన్నారు.
నాడో యజ్ఞంలా..
పేదల కోసం ఇళ్ల నిర్మాణాన్ని యజ్ఞంలా గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జరిపారని, ఊళ్లను తలపించేలా జగనన్న కాలనీలను నిర్మించిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ కాలనీల్లో కనీస వసతులను కల్పించకుండా ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాల్టీల కింద వచ్చే ప్రాంతాలనే అర్బన్ ప్రాంతాలుగా పరిగణిస్తామని ప్రస్తుతం చెప్పడంతో నిర్మాణదారులు నష్టపోతున్నారని చెప్పారు.
క్రెడిట్‌ను కొట్టేసేందుకు తాపత్రయం
ఇప్పటికే నిర్మాణం పూర్తయి గృహాల్లో ఉంటున్న వారి ఇళ్లకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి, గృహప్రవేశం పేరిట ఇప్పుడు ఫొటోలు దిగడంపై ప్రజలు విస్తుపోతున్నారని చెప్పారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పనులను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడటం సిగ్గుచేటని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేయడం కోసం హౌసింగ్‌లో రూ.3500 కోట్ల అవినీతి జరిగిదంటూ అసెంబ్లీలో సోమిరెడ్డి గగ్గోలు పెట్టారన్నారు. పొదలకూరులోని లేఅవుట్ యాజమానులను ఫోర్జరీ కేసుల పేరిట బెదిరించి, రూ.2.5 కోట్లను దండుకున్నారని.. బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు గుంజడం ఆయనకు అలవాటని ధ్వజమెత్తారు. పలు సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సైతం డబ్బులను సోమిరెడ్డి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విజిలెన్స్ విచారణ పేరిట ఇళ్ల నిర్మాణాలను ఆపి, పేదలకు నీడలేకుండా చేస్తున్నారని చెప్పారు.
రాజమహల్‌పైనే ధ్యాసంతా..!
అమరావతిలోని ఐదెకరాల్లో కట్టే రాజమహల్‌పై ధ్యాసే తప్ప.. పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఆర్థిక సాయమందిస్తానని చెప్పిన చంద్రబాబు, ఒక్క రూపాయిని సైతం ఇవ్వలేదని మండిపడ్డారు. తన వైఫల్యాలను అధికారులపై నెట్టడం, కక్ష సాధింపులకే ఆయన పరిమితమయ్యారని విమర్శించారు.


