మనోళ్లయితే.. రౌడీషీట్లు ఎత్తేద్దాం
● టీడీపీ నేతల టెలి కాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ హామీ
సాక్షి టాస్క్‌ఫోర్స్: గడిచిన 18 నెలలుగా నేరాలు, నరమేధంతో నెల్లూరు అట్టుడికిపోతోంది. బ్లేడ్ బ్యాచ్‌ల నుంచి రౌడీషీటర్ల వరకు సాగిస్తున్న అరాచకాలు, దాడులు, హత్యలు, హింసతో నగర ప్రజలు క్షణ క్షణం భయంతో వణికిపోతున్నారు. నేరస్తులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టీడీపీ నేతలతో ఆదివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ అద్దం పడుతోంది. ‘2019– 24 మధ్య రౌడీషీటర్లుగా ముద్రపడి పోలీస్‌స్టేషన్లలో రౌడీషీట్లను ఓపెన్ చేసి ఉంటే.. వారిలో మనోళ్లు ఉంటే.. వీటిని ఎత్తేద్దాం’ అంటూ నారాయణ హామీ ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నగర నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు, డివిజన్ ఇన్‌చార్జీలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నగరంలో రౌడీషీట్లు ఓపైనెన వారు ఎవరైనా ఉంటే వారిపై తొలగిద్దామన్నారు. దీనికి సంబంధించిన పత్రాలు, ఇతర కేసులకు సంబంధించిన వివరాలను పూర్తిగా సబ్మిట్ చేయాలని సూచించారు.
ఏడాదిన్నరగా అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో నెల్లూరులో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. వరుస హత్యలు, మారణకాండలు, భయోత్పాత ఘటనలు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. రాజకీయ విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీలోని రౌడీషీటర్లు, అరాచక మూకలు సాగించిన విధ్వంసం మొదలుకొని ఇటీవల గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను తరిమి తరిమి హతమార్చిన హత్యోదంతాన్ని జిల్లా చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ఇక నడిరోడ్డుపైనే చేసిన హత్యలైతే కోకొల్లలుగా ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాళెంలో నెల్లూరు – ముంబై రోడ్డుపై కార్డును అడ్డంగా పెట్టి మద్యం సేవిస్తున్న పోకిరీలను పక్కకు జరగాలని హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి తెగబడిన ఉదంతం నుంచి నెల్లూరులో రోడ్డుపై అడ్డంగా పెట్టిన బైక్‌లను తీయాలని హారన్ మోగించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్‌పై బ్లేడ్లతో పీకలు కోయడం, అడ్డుకోబోయిన కండక్టర్‌పై దాడికి తెగబడిన ఉదంతం సైతం నగర ప్రజలను ఇప్పటికీ వణికిస్తోంది. అర్ధరాత్రే కాదు.. పగలు సైతం ఒంటరిగా వెళ్లేందుకు మగాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. నిన్నటికి నిన్న.. టీడీపీ సానుభూతిపరుడు అధికారిక ముద్ర వేసుకునేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరేందుకు తన అనుచరగణంతో కలిసి చేపట్టిన ర్యాలీలో నడిరోడ్డుపై తన్నులాటను మరిచిపోకముందే రౌడీషీటర్లు టీడీపీ వారైతే షీట్లు తొలగిస్తామంటూ మంత్రి ఇచ్చిన హామీపై నెల్లూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఇదేం ఘోరమంటూ చర్చించుకుంటున్నారు.
ఇక దర్జాగా నేరాలు చేసుకోండి..


