గ్రావెల్ మాఫియా తగ్గదోయ్..!
● ప్రజాప్రతినిధి అండతో అక్రమ రవాణా
● పట్టించుకోని అధికారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అక్రమంగా రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతో ప్రభుత్వ భూములు, చెరువులను కొల్లగొట్టి దర్జాగా వెనుకేసుకుంటున్నా, అధికారులు మాత్రం మొద్దునిద్రను వీడటంలేదు.
ఎలాంటి అనుమతుల్లేకుండానే..
మండలంలోని రామదాసుకండ్రిగ, సర్వేపల్లి, నాగంబొట్లకండ్రిగ, కసుమూరు తదితర గ్రామాల్లో గల ప్రభుత్వ భూములు, చెరువుల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా గ్రావెల్‌ను నిరంతరం తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినా, వారిని బెదిరించి టిప్పర్ల ద్వారా లేఅవుట్లకు తరలించి తమ జేబులు నింపుకొంటున్నారు. సర్వేపల్లి వద్ద 20 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు నెల్లూరు నగరంలోని చెత్త, బూడిదను వందలాది టిప్పర్లలో తరలించినా, ఈ గుంతలు పూడే పరిస్థితి కానరావడంలేదు. కసుమూరు తిప్ప నుంచి చవటపాళెం సమీ పంలోని లేఅవుట్లకు గ్రావెల్‌ను రేయింబవళ్లూ తరలిస్తుండటంపై రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా, ప్రయోజనం కరువవుతోంది.
రైల్వే బ్రిడ్జి పనులనూ వదలని వైనం
రైల్వే బ్రిడ్జి కోసం తవ్విన గ్రావెల్‌ను సైతం మాఫియా తరలిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి కంటేపల్లి వెళ్లే మార్గంలో వీటి నిర్మాణ పనులు కొద్ది నెలలుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తవ్విన గ్రావెల్‌పై స్థానిక ప్రజాప్రతినిధికి అన్నీ తానై వ్యవహరించే టీడీపీ నేత కన్ను పడింది. వెంటనే టిప్పర్లలో నాలుగు రోజులుగా అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గ్రావెల్ అక్రమ రవాణా కు అడ్డుకట్టేయాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రావెల్ మాఫియా తగ్గదోయ్..!


