
అక్రమ ఇసుక, మైనింగ్‌ను అరికట్టాలి
నెల్లూరు (అర్బన్): కూటమి ప్రభుత్వంలో జిల్లాలో అక్రమంగా సాగుతున్న మైనింగ్, ఇసుక తవ్వకాలను అరికట్టి ప్రజాధనాన్ని కాపాడాలని ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళిధర్, వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఆనంద్‌ను కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా సాగుతుందన్నారు. ప్రభుత్వ ఆస్తిని దౌర్జన్యంగా కొల్లగొట్టుతున్నారన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. బినామి పేర్లతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారు ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కలెక్టర్‌గా జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలు ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన రోజు నుంచే జిల్లాలోని ఇసుక, క్వార్ట్ ్జ, సిలికాలను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల దిగువ నుంచి ఇందుకూరుపేట వరకు పెన్నానదిలో అడుగడుగునా ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తున్నారన్నారు. వీటిని నియంత్రించేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే గంజాయి బ్యాచ్‌లు, రౌడీలు, గూండాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. నగరంలో కూడా టీడీపీ నాయకులు అసాంఘిక శక్తులను విచ్చల విడిగా పెంచి పోషిస్తున్నారన్నారు. రెండు నెలల్లోనే జరిగిన 20 హత్యలే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. గంజాయి, మద్యం మత్తులో ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. హంతకులకు అండగా అధికార పార్టీ నాయకులు నిలబడడం సిగ్గు చేటన్నారు. పోలీసు శాఖ సైతం ఏమి చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీ చేసే అక్రమాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని, సామాన్యుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
కేసులకు భయపడేది లేదు
రౌడీలను, గూండాలను పెంచి
పోషిస్తున్న అధికార పార్టీ నేతలు
జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయి
సరిదిద్దకపోతే ఉద్యమిస్తాం
ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, మేరిగ,
వెంకటగిరి ఇన్‌చార్జి నేదురుమల్లి