18న పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవం
నెల్లూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని ఎస్‌బీఎస్ కల్యాణ మండపంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్ ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. నెల్లూరులో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇంటి స్థలం కోసం
దరఖాస్తు చేసుకోండి
● జేసీ కార్తీక్
నెల్లూరు రూరల్: అందరికీ ఇళ్ల పథకంలో పేదలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని జేసీ, నోడల్ అధికారి కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, నగర, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేకపోతే సేకరించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జీవిత కాలంలో ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకసారి స్థలం పొందిన వారు మళ్లీ పొందకుండా ఆధార్, రేషన్‌కార్డులను లింక్ చేస్తారన్నారు. స్థలం మంజూరైన రెండు సంవత్సరాల్లో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,221, పట్టణ ప్రాంతాల్లో 417 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
కండలేరులో
43.941 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 43.941 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయిగంగ కాలువకు 1,010, పిన్నేరు కాలువకు 100, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


