మీడియా స్వేచ్ఛను హరించడమే
● సాక్షి ఎడిటర్ ఇంట్లో
పోలీసుల తనిఖీలపై జర్నలిస్టుల నిరసన
మనుబోలు: మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం హరించడం దుర్మార్గమని జాప్ రాష్ట్ర కోశాధికారి పాశం ఏడుకొండులు, గూడూరు ప్రింట్ మీడియా డివిజన్ గౌరవాధ్యక్షుడు బాబు మోహన్‌దాస్ అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్న తీరుకు నిరసనగా మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ బషీర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా తనిఖీల పేరుతో హంగామా సృష్టించారని విమర్శించారు. ఇటీవల కావలిలో జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. తమకు నచ్చిన విధంగా వార్తలు రాయలేదనే కారణంతో జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై ప్రభుత్వం పోలీసుల చేత దాడులు చేయించడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జగదీష్ బాబు, సుధాకర్, జయకర్, శివాబి శ్రీను, ఒలిపి శ్రీనివాసులు, రవీంద్ర, బాషా, శంకర్, సాయి, సునీల్, శ్రీధర్ తదితరులతో పాటు పలువురు యూట్యూబ్ చానళ్ల విలేకరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ హక్కులను కాలరాయడమే
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా నేడు రాష్ట్రంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైపల్యాలను ప్రజలకు తెలియచేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు జరపటం, సాక్షి విలేకర్లపై అక్రమ కేసులు బనాయించటం సరైన పద్ధతి కాదు. మీడియాపై ఆంక్షలు పెట్టటం ఫాసిజమే అవుతుంది. ఇది ముమ్మాటికీ రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వాతంత్య్రపు హక్కును హరించటమే. – మస్తాన్‌బీ, ఐద్వా జిల్లా కార్యదర్శి
అది హేయమైన చర్య
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలోఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు సోదాలు చేసి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేయటం హేయమైన చర్య. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం నడుచుకుంటోంది. ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులతోపాటు జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టటం ప్రశ్నించే గొంతును నొక్కేయడమే.
– డి.అన్నపూర్ణమ్మ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి
నాజీల పాలనను తలపిస్తోంది
నెల్లూరు (బృందావనం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబడుతూ ప్రజల పక్షాన నిలిచిన ‘సాక్షి’ దినపత్రిక, ఆ పత్రిక ఎడిటర్‌ను ధనంజయరెడ్డిని వేధింపులకు గురిచేయడం నిరంకుశ నాజీల పాలనకు అద్దం పడుతోంది. ప్రచార మాధ్యమాల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజాప్రభుత్వ మనుగడకు ప్రమాదకరం. పత్రికలలో ప్రచురితమయ్యే కథనాలలో ఉన్న వాస్తవాలను విచారించుకుని వాటిని సరిదిద్దుకుంటే పాలకుల తీరును ప్రజల హర్షిస్తారు.
– ఎల్లంకి వెంకటేశ్వర్లు, కార్యదర్శి, జిల్లా పౌరహక్కుల సంఘం
పత్రికా స్వేచ్ఛపై నిబంధనలా?
నెల్లూరు (టౌన్): పత్రికా స్వేచ్ఛను కాలరాయడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. జర్నలిస్టులు రాసే వార్తలపై నిబంధనలు విధించకకూడదు. వాస్తవాలను ప్రచురించే స్వేచ్ఛను వారికి కల్పించాలి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి తనిఖీలు చేయడం పత్రికకు సంకెళ్లు వేయడంగా భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు ఒప్పులను ఎత్తి చూపే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉంటుంది. వార్తలు రాసిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదు. – బసిరెడ్డి రఘురామిరెడ్డి,
రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైఎస్సార్‌టీఎఫ్
మీడియా స్వేచ్ఛను హరించడమే
మీడియా స్వేచ్ఛను హరించడమే
మీడియా స్వేచ్ఛను హరించడమే
మీడియా స్వేచ్ఛను హరించడమే


