అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి. విద్యార్థులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలి’ అని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహ సముదాయంలో అంబేడ్కర్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆనంద్, జేసీ కార్తీక్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 62 హాస్టళ్లల్లో రూ.9.32 కోట్లతో మరుగుదొడ్లు, మరమ్మతులు, ఇతర వసతుల కల్పనకు పనులు ప్రారంభించామన్నారు. అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ కుసుమ కుమారి, రిటైర్డ్ ఏఎస్‌డబ్ల్యూఓ ఖాసిం గుడ్డ సంచులను, పెన్నులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అంబేడ్కర్ జీవిత చరిత్రపై భారత్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, ఏఎస్‌డబ్ల్యూఓ హజరత్తయ్య పాల్గొన్నారు.
ఇలాగేనా చేసేది?
అంబేడ్కర్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్ ఇరుకుగదిలో తూతూమంత్రంగా నిర్వహించారని విమర్శలు వెల్లువెత్తాయి. మహోన్నత వ్యక్తి జయంతిని చిన్నపాటి స్టడీహాల్లో నిర్వహించడాన్ని పలువురు తప్పు పట్టారు. బహుమతులు తీసుకోవడానికి వెళ్లేందుకు విద్యార్థులు కష్టపడాల్సి వచ్చింది. కార్యక్రమానికి వచ్చిన వారిలో కొందరు గది బయటే ఉన్నారు. దీనికితోడు ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు నిధులు ఇవ్వలేదంటూ వార్డెన్ల వద్ద డబ్బులు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. హాస్టల్ వెలుపల విశాలమైన స్థలం ఉన్నా అక్కడ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వ ఆదేశాలంటూ నామమాత్రంగా హాల్లో కార్యక్రమాన్ని జరిపించడం ఏమిటంటూ ప్రజా సంఘాల నాయకులు బాహాటంగా విమర్శించారు.


