సీసీ కెమెరాలా.. వద్దు బాబోయ్
నెల్లూరు(పొగతోట): జిల్లాలో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. డీలర్లు, మాఫియా కుమ్మకై ్క తమ పనిని యథేచ్ఛగా కానిస్తూ భారీగా దోచుకుంటున్నారు. ఈ తరుణంలో వీటికి అడ్డుకట్ట పడుతుందనే లక్ష్యంతో ఒక్కో రేషన్ షాపులో రెండు చొప్పున సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించారు. ఈ ఒక్క నిర్ణయం వీరిలో కలకలాన్ని రేపింది.
అందరూ ఏకమై.. అడ్డుకొని
సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలూ అందాయి. అయితే ఈ ప్రతిపాదనతో చౌక దుకాణ డీలర్లు ఏకమై వ్యవహారాన్ని అటకెక్కించారు. దీనికి కూటమి పార్టీల నేతల మద్దతు సైతం తోడైంది. మరోవైపు వీటిని ఏర్పాటు చేయాలంటే ఒక్కో డీలర్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతుందని, దీన్ని తాము భరించలేమంటూ రాష్ట్ర, జిల్లా అధికారులకు విన్నవించుకున్నారు. ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఈ ప్రతిపాదన దాదాపు నిలిచిపోయిందని సమాచారం.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 1513 చౌక దుకాణాలు, 7.2 లక్షల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో సుమారు ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల మేర అక్రమంగా రవాణా అవుతోంది. ఈ అంశమై సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్.. అధికారులు, చౌక దుకాణ డీలర్ల సంఘ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని రేషన్ షాపులు, ఎమ్మెల్‌ఎస్ పాయింట్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
మొదటికే మోసమొస్తుందనే భయం
ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మొదటికే మోసం వస్తుందని డీలర్లు భావించి కూటమి నేతల ఎదుట మొరపెట్టుకున్నారు. కెమెరాల ఖర్చును భరంచలేం.. అవసరమైతే ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రతి నెలా ఖర్చు చేయాలని సివిల్ సప్లయ్స్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో విషయం ప్రస్తుతానికి ఆగిపోయిందని డీలర్లే బహిరంగంగా చెప్తున్నారు. బియ్యం అక్రమ రవాణాతో ప్రతి నెలా కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటే వీటి ఏర్పాటుకు డీలర్లు ఎలా అంగీకరిస్తారని పలువురు పేర్కొంటున్నారు.
చౌక దుకాణాల్లో వీటి ఏర్పాటుకు నిర్ణయం
అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని డీలర్లలో ఆందోళన
ఖర్చు భరించలేమంటూ మోకాలడ్డు
అటకెక్కిన ప్రతిపాదన
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్‌ఎస్ పాయింట్లు, చౌక దుకాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అయితే వీటి ఏర్పాటుకయ్యే ఖర్చును భరించలేమని డీలర్లు కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతానికి ఆగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు చేపడతాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, జేసీ
పేదల బియ్యం అక్రమ రవాణా కట్టడే లక్ష్యంగా చౌక దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంకల్పించారు. దీనికి గానూ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని ఒక్కో షాపులో రెండింటిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రతిపాదన రేషన్ డీలర్లు, బియ్యం మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అందరూ ఏకమై కూటమి నేతలను సంప్రదించి ప్రక్రియను అటకెక్కించారు.


