మరోసారి కంటపడిన పులి
● రోడ్డు దాటుతుండగా గుర్తించిన
వాహనచోదకులు
ఉదయగిరి రూరల్: మండలంలోని కొండ కింది గ్రామాల్లో పెద్ద పులి సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా కుర్రపల్లి – కృష్ణాపురం రహదారి మార్గంలో అన్నంపల్లె సమీపంలోని జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటుతుండటాన్ని బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో మండలంలోని కృష్ణారెడ్డిపల్లెకు చెందిన దేవసాని శ్రీనివాసులురెడ్డి, మరికొందరు వాహనదారులు గుర్తించారు. ఆందోళనకు గురై కొద్దిసేపు అక్కడే ఉండి ఆపై వెళ్లారు. ఉదయగిరి అటవీ ప్రాంతంలో కణితులు, చుక్కల దుప్పులు, గోవులు అధికంగా ఉండటంతో వాటిని ఆహారంగా తీసుకుంటూ ఇక్కడే సంచరిస్తూ ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. మరోవైపు ట్రాప్ కెమెరాలను పరిశీలించేందుకు వారం పడుతుందని అటవీ అధికారులు చెప్తున్నారు.
రేషన్ షాపుల్లో
గోధుమ పిండి
నెల్లూరు(పొగతోట): చౌక దుకాణాల్లో కార్డుదారులకు గోధుమ పిండి, జొన్నలను పంపిణీ చేయనున్నామని డీఎస్‌ఓ లీలారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కార్డుదారులకే గోధుమపిండి కిలో మేర అందజేయనున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కార్డుదారులకు బియ్యాన్ని తగ్గించి మూడు కిలోల జొన్నలను ఇవ్వనున్నామని వివరించారు. ఇది అవసరం లేని వారు బియ్యాన్ని పొందొచ్చని తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ
సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. వైకుంఠ ద్వారం ద్వారా 70,256 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,102 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి దర్శనం సకాలంలో లభిస్తోంది.
జోరుగా గ్రావెల్
అక్రమ తవ్వకాలు
వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని గాయత్రినగర్ సమీపంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నిర్మిస్తున్న నూతన గృహాలకు గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. కలిగిరి మండలం భట్టువారిపాళెం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో జేసీబీల ద్వారా తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా తరలించారు. కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతున్నా, రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పేదలు తమ అవసరాల నిమిత్తం గ్రావెల్‌ను తరలిస్తే ఆంక్షలు పెట్టి వేధించే అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు.
ఓపెన్ ఫోరమ్ నేడు
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశ మందిరంలో ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టౌన్ ప్లానింగ్ విభాగ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని ఇన్‌చార్జి సిటీ ప్లానర్ రఘునాథరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ నందన్ నేతృత్వంలో జరగనున్న కార్యక్రమంలో పెండింగ్ ప్లాన్ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లు, మార్ట్‌గేజ్ రిలీజ్, లే అవుట్ రెగ్యులరైజేషన్ వంటి టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఇతర సమస్యలతో పాటు బీపీఎస్ పథకంపై అవగాహన కల్పించడం, పరిష్కారాలు అందించేందుకు అధికారులందరూ హాజరవుతారని తెలిపారు. సంబంధిత భవన యజమానులు, ఎల్టీపీలు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఇంజినీర్లు హాజరై సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
మరోసారి కంటపడిన పులి


