రెండేళ్ల నుంచి పంజా విసురుతున్న దుండగులు
● నేర్వని.. గత ఘటనల గుణపాఠం
● రెండేళ్లుగా ఒక్కరినీ
పట్టుకోలేకపోయిన జీఆర్పీ, ఆర్‌పీఎఫ్
● సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేస్తూ సవాల్ విసురుతున్న ముఠా
● రెండేళ్లలో ఏడు రైళ్లలో దోపిడీలు
● తొమ్మిది నెలల విరామం అనంతరం మరోసారి విజృంభణ
● తాజాగా ఒకే రోజు అల్లూరురోడ్డు,
పడుగుపాడు వద్ద సిగ్నల్స్ ట్యాంపరింగ్
● బెంగళూరు ఎక్స్‌ప్రెస్, మధురై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు టార్గెట్
● మధురై రైల్లో చెలరేగిన దుండగులు
నెల్లూరు (క్రైమ్)/బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి దోపిడీలు చేసే ముఠా చెలరేగిపోతోంది. రైలు ప్రయాణికులపై దోపిడీ పంజా విసురుతోంది. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో విచారణ పేరుతో కొంత కాలం హడావుడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోతున్నారు. ఆయా కేసుల్లో కనీసం ఒక్క దుండగుడ్ని కూడా అరెస్ట్ చేయలేకపోవడంతో రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల నిఘా వ్యవస్థలకు ఈ ముఠాలు ఆదమరిచి మరీ సవాల్ విసురుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు– బిట్రగుంట రైల్వేస్టేషన్ల మధ్య రెండు రైళ్లను టార్గెట్ చేసి రెండు చోట్ల సిగ్నల్ ట్యాంపరింగ్ చేశారు. ఒక రైల్లో దోపిడీకి విఫలయత్నం చేయగా, మరో రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. అదే రైలు మరో స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. అల్లూరు రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో అర్ధరాత్రి 11.13 గంటల సమయంలో రైలు పట్టా జాయింట్ (గ్లూడ్ జాయింట్) మధ్య కాయిన్ పెట్టి హోమ్ సిగ్నల్స్ ట్యాంపర్ చేయడంతో హౌరా నుంచి బెంగళూరు వెళ్తున్న 12863 నంబర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. అయితే సిగ్నల్ ట్యాంపర్ జరిగిన ప్రాంతానికి రైలు నిలిచిన ప్రాంతానికి మధ్య దూరం ఉండడంతో ఈ రైల్లో దోపిడీ విఫలం అయింది. అదే మార్గంలో గంట సమయం తర్వాత 12.05 గంటల సమయంలో ఛండీగర్ నుంచి మదురై వెళ్తున్న 20494 నంబర్ మదురై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను రైలును అల్లూరురోడ్డు స్టేషన్ సమీపంలో చైన్‌లాగి నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే ఎస్–2, ఎస్–4, ఎస్–5 కోచ్‌ల్లో ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు చైన్లు, రెండు బ్యాగులు అపహరించారు. అల్లూరు రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ ట్యాంపర్ అయిన విషయం తెలుసుకున్నప్పటికీ రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిఘా వ్యవస్థను అప్రమత్తం చేసి ఉంటే అదే మార్గంలో అదే ప్రాంతంలో గంట సమయం తర్వాత వచ్చిన మరో రైల్లో దోపిడీ జరిగే అవకాశం ఉండేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అల్లూరు రోడ్డు స్టేషన్ తర్వాత పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలోనే మరో సిగ్నల్ పాయింట్ వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఉండడంతో దోపిడీకి గురై మదురై ఎక్స్‌ప్రెస్ మరోసారి నిలిచిపోయింది. ఈ ఘటనలు పూర్తిగా రైల్వే స్టేషన్ మాస్టర్ల నుంచి నిఘా వ్యవస్థ వరకు ఘోర వైఫల్యం కనిపిస్తోంది.
సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రైళ్లలో దోపిడీకి పాల్పడిన ఘటనలు 2023 నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి.
● 2023 జూన్ 24వ తేదీ వేకువన తెట్టు వద్ద సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడ్డారు.
● రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే రెండు నెలల వ్యవధిలో అదే ఏడాది ఆగస్ట్ 14వ తేదీ వేకువన వీరేపల్లి వద్ద చైన్నె ఎక్స్‌ప్రెస్, తెట్టు రైల్వే బ్రిడ్జి వద్ద చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడ్డారు.
● ఇదే తరహాలో సెప్టెంబర్ 16వ తేదీన సింగరాయకొండ వద్ద చైన్నె ఎక్స్‌ప్రెస్‌లో, సెప్టెంబర్ 18న అల్లూరు రోడ్డు వద్ద పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు.
● 2024 జూన్ 12వ తేదీ వేకువన కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వే స్టేషన్ల మధ్య చైన్నె వైపు వెళ్లే మార్గంలో వేకువన 1.50 గంటల సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఽనరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న 17247 నంబరు ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైల్లోకి ప్రవేశించిన దుండుగులు ఎస్–13 బోగీ, ఎస్ 11 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు.
● అదే రోజు అక్కడే మకాం వేసి 2.15 గంటల నుంచి 2.30 గంటల మధ్య షిరిడీ సాయినగర్ నుంచి తిరుపతి వెళుతున్న 07638 నంబరు తిరుపతి స్పెషల్ రైల్లో ఎస్–3, ఎస్–5 కోచ్‌ల్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు.
నిఘా హడావుడి చేసి..
అప్పట్లో రైల్వే పోలీసులు ఆర్పీఎఫ్, సివిల్ పోలీసుల సహకారంతో నేరాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టారు. రైళ్లలో బీట్ వ్యవస్థను పటిష్టం చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, స్థానిక నేరస్తులతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ముఠాల కదలికలపై నిఘా పెట్టారు. నేరాలు అధికంగా జరిగే అవకాశమున్న నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో నెల్లూరు సౌత్, నార్త్ (హోమ్ సిగ్నల్ పాయింట్), పడుగుపాడు ఔటర్ సిగ్నల్‌పాయింట్, గూడూరు సౌత్, వెస్ట్ హోమ్ సిగ్నల్ పాయింట్, సింగరాయకొండతో పాటు జాతీయరహదారికి దగ్గరగా ఉండే తలమంచి, మనుబోలు తదితర ప్రాంతాల్లో గస్తీని పెంచారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లోని 99 చీకటి ప్రాంతాలను గుర్తించి లైటింగ్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా ఈ తరహా నేరాలు జరగకపోవడంతో నిఘా వ్యవస్థ రిలాక్స్ అయింది. ఇదే అదనుగా దోపిడీ దుండగలు మరోసారి పంజా విసిరారు.
తొమ్మిది నెలల విరామం తర్వాత
తాజాగా మరోమారు తొమ్మిది నెలల విరామం అనంతరం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అల్లూరు రోడ్డు వద్ద దొంగలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చంఢీఘర్–మధురై రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. ఎస్–2, ఎస్–3, ఎస్–5 కోచ్‌ల్లో రెండు చైన్‌స్నాచింగ్, రెండు బ్యాగ్‌లను అపహరించారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత నిదానంగా రైల్వే, ఆర్ఫీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జనార్దన్, సీ సుధాకర్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక పోలీసుల సహకారంతో అల్లూరు రోడ్డు స్టేషన్ నుంచి నెల్లూరు, కావలి వైపు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు.
రైలు ప్రయాణికులపై దోపిడీ పంజా
రైల్వేలో నిఘా, భద్రతా యంత్రాంగం నిద్రోతుంది. సిబ్బంది కొరత పేరుతో రైల్లో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు. ప్రయాణికుల రైళ్లలో రాత్రి వేళలో నిఘా వైఫల్యం దోపిడీ ముఠాలకు వరంగా మారింది. ఇదే అదనుగా దోపిడీ దుండగులు రైల్వే సాంకేతిక టెక్నాలజీని వాడుకుంటూ నిర్మానుష్య ట్రాక్ ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి దోపిడీ పంజా విసురుతున్నారు. నెల్లూరు రైల్వే పోలీస్ డివిజన్ పరిధిలో గడిచిన రెండేళ్లలో ఆరు రైళ్లల్లో దోపిడీలకు పాల్పడ్డా.. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. నిఘా వ్యవస్థ అసమర్థతను సవాల్ చేస్తూ తాజాగా బిట్రగుంట–నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్య రెండు చోట్ల సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రెండు రైళ్లల్లో దోపిడీకి ప్లాన్ చేసినా ఒక రైల్లోనే దోపిడీ చేయగలిగారు.
రెండేళ్ల నుంచి పంజా విసురుతున్న దుండగులు


