కావలి: నియోజకవర్గంలోని దగదర్తి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవికి జరగాల్సిన ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తూ ఎన్నికల అధికారులు నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ పదవికి గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. అయితే గురువారం ఎంపీటీసీ సభ్యులు రాకపోవడంతో శుక్రవారం నిర్వహించేందుకు మరోసారి షెడ్యూల్ ప్రకటించారు. అయితే శుక్రవారం సైతం ఎంపీటీసీ సభ్యులు ఎవరూ హాజరు కాపోవడంతో నిర్దిష్ట సమయం వరకు వేచి చూసిన ఎన్నికల నిర్వహణాధికారులు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మండలంలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో శ్రీరామపురం ఎంపీటీసీ సభ్యురాలు పీతల కామేశ్వరమ్మ గతంలో మండల ఉపాధ్యక్షురాలిగా ఉండేవారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైస్ ఎంపీపీ పదవికి గురువారం ఎన్నిక నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు నెల్లూరు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.సుబ్బరాజును ఎన్నికల అధికారిగా, దగదర్తి ఎంపీడీఓ జి.వెంకటేశ్వర్లు సహాయ ఎన్నికల అధికారిగా నియమించింది. మొదటి రోజు ఎన్నికల షెడ్యూల్ సమయం 11 గంటల వరకు నిరీక్షించినా సమావేశ మందిరానికి ఎంపీటీసీలు ఒక్కరు కూడా రాలేదు. దీంతో ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం మరో గంట సమయాన్ని అదనంగా కేటాయించినా కోరం లేకపోవడంతో ఎన్నికను, శుక్రవారానికి వాయిదా వేశారు. రెండో రోజూ పరిస్థితి అలాగే ఉండడంతో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అల్లూరు, బిట్రగుంట ఎస్సైలు కె.కిశోర్‌బాబు, భోజ్యానాయక్ ప్రత్యేక పోలీసులతో కలిసి మండల ప్రజా పరిషత్ కార్యాలయ పరిసరాల్లో బందోబస్తు చర్యలు తీసుకున్నారు.


