మర్రిపాడు: ఓ వ్యక్తి పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాడు. వారిప్పుడు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. భార్య అనారోగ్యంతో మంచాన పడింది. వృద్ధాప్యంలో ఉన్న అతను ఆమె బాధ చూడలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని రాజులపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బక్కిరెడ్డి (70)కి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలకు వివాహాలై బెంగళూరులో ఉంటున్నారు. మూడేళ్ల క్రితం బక్కిరెడ్డి భార్య పక్షవాతంతో మంచాన పడింది.
సంతానం దగ్గర లేకపోవడం.. ఎవరూ పట్టించుకోకపోవడంతో భార్యకు సపర్యలు చేయడం బక్కిరెడ్డికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె పడుతున్న బాధ చూడలేక ఆయన ఎంతగానో ఆవేదన చెందేవాడు. గురువారం బక్కిరెడ్డి గ్రామానికి సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.