రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 50.025 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 110, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆగి ఉన్న లారీని
ఢీకొట్టిన బైక్
● వ్యక్తి మృతి
దుత్తలూరు: ఆగి ఉన్న లారీని మోటార్‌బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి నర్రవాడ – తెడ్డుపాడు దారిలో 565వ జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేష్ (35) నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీలోని తన ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. ఈక్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించలేదు. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై పి.ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సురేష్‌కు భార్య ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(టౌన్): జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025 – 26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు మే 22వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. జిల్లాలో వలేటివారిపాళెం మండలంలోని చుండి, ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాళెం, కందుకూరు మండలంలోని జి.మేకపాడు, కలిగిరి, కావలి మండలంలోని ఒట్టూరు, కొండాపురం, సీతారామపురం, ఏఎస్‌పేట, దుత్తలూరు ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన బడుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ, ఈబీసీలకు రూ.200లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.150లు ఉంటుందన్నారు. పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.
చేపలు పట్టేందుకు వెళ్లి..
● పెన్నానదిలో పడి యువకుడి మృతి
ఆత్మకూరు: పెన్నా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఏలూరు రవీంద్ర అనే గిరిజన యువకుడు నీళ్లలో పడి మృతిచెందిన ఘటన ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. గిరిజన కాలనీకి చెందిన ఏలూరు రవీంద్ర (27) చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని పెన్నానదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతిచెందాడు. స్థానికులు రవీంద్ర బంధువులకు తెలియజేశారు. వారొచ్చి పరిశీలించగా నదిలో రవీంద్ర మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


