అస్తవ్యస్తంగా పది పరీక్షలు
నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలి రోజు సోమవారం అస్తవ్యస్తంగా నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఆలస్యంగా పరీక్షలు జరిగినట్లు తెలిసింది. కొన్ని సెంటర్లలో వసతులపై పేరెంట్స్, సెంటరు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. విడవలూరు మండలం వావిళ్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని ఓ గది తాళాన్ని పగుల కొట్టి విద్యార్థులు లోపలికి పంపించిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని మాగుంట లేవుట్‌లోని కేకేఆర్ గౌతమ్ స్కూల్‌లో 15 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనట్లు విద్యార్థులు చెప్పారు. నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌లో వసతులపై పేరెంట్స్, సెంటర్ నిర్వాహకులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. చాలా సెంటర్లలో సరైన గాలి, వెలుతురు లేకపోవడంతో ఉక్కపోతతో పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఓ వైపు, ఇరుకు గదుల్లో పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. పలు కేంద్రాల్లో హాల్ టికెట్ల నంబర్ల డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో గదులు ఎక్కడో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని సెంటర్ల అడ్రసు సరిగా లేకపోవడంతో వెతకడానికే సమయం సరిపోయిందంటున్నారు. విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాఽశారు. వారికి తాగేందుకు నీరు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడ్డారు. ఈ విషయంపై డీఈఓకు ఫోన్ చేయగా సరైన కారణాలతో ఆలస్యంగా ప్రారంభమైన సెంటర్లలో అదనంగా సమయం కేటాయించమని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
384 మంది గైర్హాజరు
తొలి రోజు తెలుగు పరీక్షకు 28,496 మంది రెగ్యులర్, 734 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. రెగ్యులర్ 28,492 మంది, ప్రైవేట్ విభాగంలో 354 మంది హాజరయ్యారు. మొత్తంగా 380 మంది గైర్హాజరయ్యారు.
కొన్ని సెంటర్లలో ఆలస్యంగా
పరీక్ష ప్రారంభం
వావిళ్ల సెంటరులో తాళాలు
పగులకొట్టి తలుపులు తీసిన పేరెంట్స్
వసతులు లేక ఇబ్బందులు పడిన విద్యార్థులు


