భోళాశంకరా.. సర్వ శుభంకరా | - | Sakshi
Sakshi News home page

భోళాశంకరా.. సర్వ శుభంకరా

Nov 14 2023 12:46 AM | Updated on Nov 14 2023 12:46 AM

మూలస్థానేశ్వరాలయంలో కార్తీక దీపాలు 
వెలిగిస్తున్న భక్తులు  - Sakshi

మూలస్థానేశ్వరాలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని మూలాపేటలో స్వయంభువుగా వెలసిన శ్రీభువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల ప్రకారం ముక్కంటిరెడ్డికి పెద్ద పశువుల మంద ఉంది. అతని పశువులను కాపరి మేతకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొచ్చేవాడు. అయితే ఆ పశువుల మందలోని ఓ గోవు ఇంటికి వచ్చినా పాలు ఇవ్వకపోవడాన్ని ముక్కంటిరెడ్డి గుర్తించి పశువుల కాపరిని నిలదీశాడు. అయితే తనకేమీ తెలియదని ఆ కాపరి బదులివ్వడంతో ఆ గోవును ఓ కంట గమనిస్తుండాలని ఆదేశించాడు. పశువుల మంద నుంచి వీడిన ఆ గోవు సమీపంలోని పొదల వద్దకు వెళ్లి తన పొదుగు నుంచి పాలను ఆ పొదలలో ఉన్న రాతిపై ధారగా కురిపించడాన్ని గమనించిన పశువుల కాపరి యజమాని ముక్కంటిరెడ్డికి తెలియజేశాడు. పశువుల కాపరి కోపోద్రిక్తుడై తన వద్ద ఉన్న గొడ్డలితో పొదల్లో ఉన్న రాయిని గట్టిగా కొట్టగా ఆ రాతి నుంచి రక్తస్రావం జరిగింది. దీంతో భీతిల్లిన అతను పరుగుపరుగున ముక్కంటిరెడ్డి వద్దకు వెళ్లి జరిగిన వృత్తాంతాన్ని వివరించాడు. ఆ రోజు రాత్రి ముక్కంటిరెడ్డికి స్వప్నంలో పరమేశ్వరుడు కనిపించి ఆ శిల తన స్వరూపం శివలింగంగా పేర్కొని అక్కడ ఆలయాన్ని నిర్మించాలంటూ ఆదేశించారు. 14వ శతాబ్దంలో ముక్కంటిరెడ్డి నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం మూలస్థానేశ్వరాలయంగా విరాజిల్లుతోంది. నెల్లూరులో ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

చంద్రశేఖర పాహిమాం

తోటపల్లిగూడూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలంలోని కాటేపల్లిలో శ్రీకామాక్షిదేవి సమేత చంద్రశేఖరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. 70 ఏళ్ల క్రితం కాటేపల్లి సముద్ర తీరాన బట్టారకం కామయ్యస్వామి ఈ ఆలయాన్ని నిర్మించారు. సముద్ర తీరాన, ఇసుక తిన్నెల మధ్య కొలువైన చంద్రశేఖరస్వామి భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా ప్రశస్తి. శివరాత్రి ఉత్సవాలతోపాటు కార్తీక మాసంలో జిల్లావ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమశిలలో సోమేశ్వరుడు

సోమశిల: అనంతసాగరం మండలం సోమశిలలోని సోమేశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు, ఆలయ అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మాసం మొత్తం సోమేశ్వరాలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటారు.

భక్తుల కోర్కెలు తీర్చే అమరలింగేశ్వరుడు

ఉలవపాడు: భక్తుల కోర్కెలు తీర్చే గంగాపార్వతీ సమేత అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఉలవపాడు మండల పరిధిలోని మన్నేటికోటలో ఉంది. కార్తీక మాసంలో ఈ ఆలయంలో మహా మృత్యుంజయ హోమాలు జరుగుతాయి. ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1300 ఏళ్ల క్రితం పల్లవ రాజులు మన్నేరు పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత మన్నేటి ప్రవాహానికి ఈ గుడి ఇసుకతో కప్పబడింది. 75 ఏళ్ల క్రితం ఆలయం ఆనవాళ్లు పైన కనపడడంతో ఇసుకను తొలగించారు. ఇందులో పల్లవరాజులు 1300 ఏళ్ల క్రితం నిర్మించినట్లు శాసనం బయటపడింది. 75 ఏళ్ల నుంచి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భూమట్టానికి పూర్తిగా ఈ ఆలయం దిగువన ఉంది. కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ముడుపులు కట్టి మొక్కుకుంటారు.

పరశురాముడు నడయాడిన క్షేత్రం కోటితీర్థం

చేజర్ల: జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో చేజర్ల మండలంలోని కోటితీర్థం ఒకటి. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పరశురాముడు మాతృ హత్యా దోషం పోవడానికి పరశురాముడు అనేక దేవాలయాలను దర్శించుకుంటూ పెన్నానదీ తీరాన కొంతకాలం ఉండి తపస్సు చేసి ఆ పరమేశ్వరుడిని భక్తితో పూజించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి శివలింగాన్ని ఆయన ప్రతిష్టించాడని చరిత్రకారులు చెబుతారు. ఈ క్షేతానికి పక్కనే పెన్నానది ఉండడంతో భక్తులు వేకువజామునే స్నానాలు ఆచరించి శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. కార్తీక మాసంలో ఈ క్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు. కోటితీర్థానికి నెల్లూరు నుంచి వయా చేజర్ల మీదుగా నిత్యం బస్సు ఉంటుంది.

ఎంతో విశిష్టత గల కార్తీక మాసం ఆరంభమైంది. జిల్లాలోని శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ఆ పరమేశ్వరుడిని దర్శించుకుని ఏకాదశ రుద్రాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయా క్షేత్రాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రారంభమైన కార్తీక మాసం

శివ నామస్మరణతో

మార్మోగనున్న శైవక్షేత్రాలు

ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు

నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయం 
1
1/3

నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయం

మన్నేటికోటలోని అమరలింగేశ్వరస్వామి దేవస్థానం  
2
2/3

మన్నేటికోటలోని అమరలింగేశ్వరస్వామి దేవస్థానం

చేజర్ల మండలంలోని కోటితీర్థం శివాలయం 3
3/3

చేజర్ల మండలంలోని కోటితీర్థం శివాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement