
మాట్లాడుతున్న వాణి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వాణి
వెంకటాచలం: ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక వివాదాల జోలికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వాణి సూచించారు. మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా కేంద్ర కారాగారంలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముందుగా జైలులోని ఖైదీలు, వారిని కలిసేందుకు వచ్చిన బంధువులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలున్నాయా? అని ఆరాతీశారు. ఖైదీలను కలిసేందుకు సక్రమంగా అనుమతులు ఇస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న వ్యక్తులు విడుదలయ్యాక సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయసాయం అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్ సాయి ప్రవీణ్, జైలర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.