ఎక్కడికైనా.. నెల్లూరు నుంచి పెరిగిన నిమ్మ ఎగుమతులు

● భారీగా పెరిగిన నిమ్మకాయల ఎగుమతులు
● నెల్లూరు నిమ్మకు పెరిగిన పోటీ
పొదలకూరు : కాలువలు, బోర్లలో పుష్కలంగా లభ్యమవుతున్న జలాలతో మెట్టప్రాంత రైతులు నిమ్మతోటలను కాపాడుకుంటూ దిగుబడులు పెంచుకుంటున్నారు. ఫలితంగా గతేడాదితో పోల్చిచూస్తే కాయల ధరల్లో వ్యత్యాసం కనపడుతోంది. మార్చి మొదటి వారంలో ఆశించిన దానికంటే ధరలు బాగా పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతంగా లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.4 వేల నుంచి రూ.5,500 వరకు ధర పలుకుతున్నాయి. కిలోల లెక్కన చూస్తే రూ.60 నుంచి రూ.65 మాత్రమే అమ్ముడుపోతున్నాయి. మార్చి మొదటి వారంలో బస్తాకాయలు రూ.7,500 వరకు ధర పలిగిన విషయం తెలిసిందే. పొదలకూరు, గూడూరు నిమ్మమార్కెట్ల నుంచే ప్రతినిత్యం 25 లారీల్లో కాయలు ఎగుమతి అవుతున్నాయి. అలాగే తెనాలి, ఏలూరు, రాజమండ్రి మార్కెట్ల నుంచే కాకుండా రాయలసీమ జిల్లాల్లోని చిన్నచిన్న మార్కెట్ల నుంచి నిమ్మకాయలు ఎగుమతి అవుతున్నాయి.
సుమారు 100 లారీల్లో..
ప్రస్తుతం నిమ్మకాయల ఎగుమతులు పెరిగాయి. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా బయటి రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం సుమారు 100 లారీల్లో కాయలు ఎగుమతి అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో కాయల ఎగుమతి విపరీతంగా పెరిగి వేసవిలోనూ ధరలు దిగజారుతున్నాయి. ఇవికాక తెలంగాణ రాష్ట్రం నకిరేకల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం నిమ్మకాయల ఎగుమతి పెరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీతో పాటు, లక్నో, వారణాసి, మధుర, గోరఖ్‌పూర్, అలహాబాద్ తదితర ప్రాంతాలకు కాయల ఎగుమతి చేస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలకు కాయలు వెళ్లడం లేదు. కేవలం గృహ వినియోగానికి, శీతల పానియాలు సేవించేందుకు మాత్రమే నిమ్మకాయలను ప్రస్తుత వేసవి సీజన్లో వినియోగిస్తున్నారు.
శీతాకాలంలోనే పరిశ్రమల కొనుగోలు
ఊరగాయ పరిశ్రమలు, సబ్బులు, చాక్లెట్లు, ఇతర నిమ్మ ఆధారిత వస్తువుల తయారీ పరిశ్రమలు కాయలను శీతాకాలంలోనే కొనుగోలు చేస్తారు. శీతాకాలంలో నిమ్మ వినియోగం తక్కువగా ఉండడంతో పాటు ధరలు స్వల్పంగా ఉంటాయి. ఈ సమయంలో పరిశ్రమలు కాయలను కొనుగోలు చేసి నిమ్మ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకుంటాయి. వేసవిలో ఫ్యాక్టరీల యాజమాన్యాలు కాయలను కొనుగోలు చేస్తే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తలు :