ఎనిమిదేళ్ల తర్వాత అధికంగా..

నెల్లూరు(సెంట్రల్): జిల్లా నుంచి రైల్వే శాఖకు రాబడి అధికంగా వస్తోంది. ఇందులో ప్రధాన ఆదాయవనరుగా అదానీ కృష్ణపట్నం పోర్టు ఉంది. బొగ్గుతోపాటు ఇతర సరుకులు పెద్దఎత్తున గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా చేస్తున్నారు.
2014లో టాప్
పోర్టు నుంచి వివిధ సరుకుల దిగుమతులు బాగా జరుగుతున్నాయి. వాటిని ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. 2014–15 కాలంలో రైల్వే శాఖ పోర్టు నుంచి 12.94 మిలియన్ టన్నుల బొగ్గును తరలించి అప్పట్లో రికార్డు సృష్టించింది. ఆ ఏడాదిలో బొగ్గు వల్లే రూ.1,179 కోట్ల రాబడి వచ్చింది. ఇతర సరుకుల రవాణాతో కలిపి మొత్తంగా రూ.1,988.17 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ ఏడాదిలో..
ఎనిమిది సంవత్సరాల తర్వాత ఊహించని దానికన్నా ఎక్కువగా బొగ్గు రవాణా జరిగింది. 2022–23 సంవత్సరానికి 13 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించారు. దీంతో సుమారు రూ.1,500 కోట్లు, ఇతర సరుకుల రవాణా ద్వారా రూ.500 కోట్ల రాబడి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 5 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా కాగా రూ.560 కోట్లు, మిగిలిన సరుకుల రవాణా ద్వారా రూ.391 కోట్లు వచ్చింది. గతేడాది కన్నా ఈ ఏడాది అధికంగా రవాణా సరుకుల ద్వారా జిల్లా నుంచి రైల్వేకి అధికంగానే రాబడి వచ్చింది.
నిత్యం 12 గూడ్స్ రైళ్ల ద్వారా..
పోర్టు నుంచి నిత్యం 12 గూడ్స్ రైళ్ల ద్వారా సరుకులను రైల్వే తరలిస్తోంది. దీంతో రోజుకు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వస్తోందని అంచనా. కాగా బొగ్గుతోపాటు ఎక్కువగా ఎరువులు, ఐరన్, లైమ్‌స్టోన్ తదితర సరుకులను రవాణా చేస్తుంటారు.