
దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్ హల్క్ హోగన్ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా హోగన్ మృతి చెందినట్లు తెలుస్తుంది.
1953 ఆగస్ట్ 11న జన్మించిన హోగన్ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.
హోగన్‌కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. హోగన్ తన కెరీర్ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్, మాఛో మ్యాన్ రాండీ సావేజ్, అల్టిమేట్ వారియర్ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్‌కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.
హోగన్ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు. హోగన్‌కు భారత్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్ సుపరిచితుడు.